2019లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడం ప్రస్తుతానికి కష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదని అన్నారు.
నెహ్రూ-గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని షీలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం ఎంతో అవసరమని, పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలది తిరుగులేని నాయకత్వమని అన్నారు. గాంధీ కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని పాలించిందని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరడంపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పటికీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, మరో జన్మలోనూ సిద్ధాంతపరంగా తాము విభేదిస్తామని స్పష్టం చేశారు.
మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడాలని షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య అవగాహన కుదరాలని, కూటమి ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మోదీ స్థాయి గల నాయకుడు ఉన్నారా అన్న ప్రశ్నకు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అద్భుతంగా పనిచేశారని, సమయం వచ్చినపుడు మోదీని ఎదుర్కొనే నాయకుడిని ప్రకటిస్తామని షీలా చెప్పారు.