మద్దతుగా నిలుస్తున్న ఇన్వెస్టర్లు, భాగస్వాములు
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) వెల్లడించింది.
హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్‌సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది.
మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది.
మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది.
దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment