సాక్షి, ఆదిలాబాద్: కరెంటు అధికారుల లీలలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడే పూర్తయ్యేవికావు.. ప్రతీ పని వెనుక వేలు, లక్షల రూపాయల స్వార్థం, అక్రమాలు కనిపించడం సర్వసాధారణం. పైసలిస్తే పనేదైనా చేసేస్తారు. అదే పైసలివ్వకపోతే ఏడాది కాదు, దశాబ్దాలు దాటినా పని పూర్తికాదు. దానికి ఉదాహరణ లేకపోలేదు. ఆదిలాబాద్ పట్టణంలోని కోర్టు ఎదురుగా విద్యానగర్‌కు వెళ్లే దారిలో 30 ఇళ్లపై నుంచి 33కేవీ లైన్ వెళ్తుంది.
దీనిని మార్చాలని వందలసార్లు ఆ కాలనీవాసులు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా దాన్ని మార్చే సాహసం ఏ విద్యుత్ శాఖ అధికారి చేపట్టకపోవడం గమనార్హం. అదేమంటే వారి చేతిని బలంగా తడిపితేనే ఆ లైన్ కదిలే పరిస్థితి ఉంది. లేనిపక్షంలో ప్రజల ప్రాణాలు పోయినా వారికి పట్టింపులేదు. ఆదిలాబాద్ పట్టణమనే కాకుండా జిల్లాలో మొత్తం ఇదే పరిస్థితి ఉంది.
ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలన్నా, లైన్‌ను కొంత దూరం జరపాలని ప్రజలు మొర పెట్టుకున్నా వారు స్పందించిన దాఖలాలు లేవు. అదే ఆమ్యామ్యాలు ఇస్తే పని ఎలాగైనా చేసేస్తారు. రాంనగర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 33 కేవీ లైన్‌ను ఒక సైడ్ ఆర్మ్ మీద బిగించారంటే వీరి అత్యాశ ఎంతటి పరిస్థితికి దారి తీస్తుందనేది తెలుస్తోంది. విద్యుత్ సంస్థ నియమాల ప్రకారం ఇలాంటి పెద్ద లైన్‌ను ఒక సైడ్ ఆర్మ్ మీద ఉంచడమనేది సాహసంతో కూడుకున్న పని అని అధికారులే చెబుతారు. అయినా చేసేది కూడా వారే.
ఎన్నో లీలలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల అవినీతి లీలలకు కొదువలేదు. వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఇలాంటి లైన్‌లు మార్చేందుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. మావల వద్ద 33 కేవీ లైన్ మార్చేందుకు సమీపంలోని వాణిజ్య సముదాయాలు లక్షల రూపాయలను అధికారులకు ముట్టజెప్పడంతోనే ఆర్‌అండ్‌బీ అధికారులను బోల్తా కొట్టించి టెక్నికల్ సాంక్షన్‌లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టారంటే వీరంతటి ఘనులో ఇట్టే తెలిసిపోతోంది.
ఇలాంటి అక్రమ పనులను కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తారు. అదే మామూలు వ్యక్తుల పనులైతే రోజులు, నెలలు, సంవత్సరాలు దాటినా పూర్తికావు. ఏ పనికైనా చేతి తడపనిదే పని జరగదనేది విద్యుత్ శాఖలో జగమెరిగిన సత్యం. ఈ పనులన్నింటిని నామినేషన్ పద్ధతిలోనే అధికారులు దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం. ఉన్నతాధికారుల హస్తం లేకుండా ఇవి జరుగుతాయనుకుంటే పొరపాటే.
వారి ఆదేశాలకు అనుగుణంగానే పనులు జరుగుతాయనే దానికి మావల సంఘటనే నిదర్శనం. తనకు తెలియకుండానే ఈ పనులు జరిగాయని ఏఈ విచారణ అధికారులకు తెలిపారంటే ఉన్నతాధికారులు ఎంత ఘనాపాఠిలో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా కొంతమంది ఉన్నతాధికారులు ఇక్కడే పాతుకుపోయారు. దీంతో వారి హస్తం లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి ఉంది. ఆరేళ్ల కిందట ఆదిలాబాద్‌లోనే 6 కిలోమీటర్ల కండక్టర్ రూ.10లక్షల విలువైంది మాయమైంది.
శాఖ అధికారులే దీన్ని అక్రమ పనులకు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతూ అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల దుబ్బగూడ వద్ద అనధికారికంగా శ్మశానవాటికకు స్తంభాలు వేసి కండక్టర్ వేయడం ఇదే కోవలోకి వస్తుంది. ఇలా ప్రతీ అంశంలో విద్యుత్ శాఖలో అవినీతి చోటుచేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment