30 వేలు ఇచ్చుకో.. రెన్యువల్ పుచ్చుకో! | Bribery Allegations on Minister Sailajanath for DEd Colleges Renewals | Sakshi
Sakshi News home page

30 వేలు ఇచ్చుకో.. రెన్యువల్ పుచ్చుకో!

Published Mon, Sep 2 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

Bribery Allegations on Minister Sailajanath for DEd Colleges Renewals

సాక్షి, హైదరాబాద్:  డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల రెన్యువల్స్‌లో ముడుపుల దందాకు తెరలేచింది. మంత్రి శైలజానాథ్ పేరుతో ఆయన అనుచరులే వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ఇవ్వనిదే అనుమతి రాదని, తాము ఓకే అంటే మంత్రి సంతకం చేస్తారని చెబుతూ ఒక్కో కాలేజీ యాజమాన్యం నుంచి రెన్యువల్‌కు రూ. 30 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధమంగా రూ. 30 వేలు ఇవ్వాలని, ఎన్ని లోపాలుంటే అంత ఎక్కువ మొత్తం చెల్లించాలంటూ వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ వ్యవహారంలో రూ. 20 కోట్లు దండుకునే లక్ష్యంతో మంత్రి అనుచరులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ తతంగం మంత్రికి తెలుసా? ఆయనకు తెలియకుండా మంత్రి అనుచరులే దందాకు దిగారా? అనే విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి మంత్రి పేరుతో జరుగుతున్న ఈ తతంగంపై యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 ముడుపుల కోసం కాలేజీ వారీ ఫైళ్లు..
 కాలేజీల రెన్యువల్స్ కోసం ఏకమొత్తంగా ఒకేసారి 422 కాలేజీలకు ఒక ఫైలు, మరో 228 కాలేజీలకు మరో ఫైలును విద్యాశాఖ మంత్రి కార్యాలయానికి జూలైలో పంపించింది. ఇలా ఏకమొత్తంగా వచ్చిన ఫైలులోని కాలేజీలకు రెన్యువల్స్ ఇవ్వడం కుదర దని పేర్కొంటూ ఒక్కో కాలేజీకి ఒక్కో ఫైలు వేర్వేరుగా (ఇండివిడ్యువల్‌గా) పంపించాలని ఆదేశించి మరీ ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కార్యాలయం ఆదేశాలతో విద్యాశాఖ వేర్వేరు ఫైళ్లను పంపించాకే ముడుపులు ముట్టజెప్పిన ఒక్కో కాలేజీకి సంబంధించి వేర్వేరు ఉత్తర్వులు జారీ అవుతుండటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. మంత్రి సచివాలయానికి రాకపోయినా ముడుపులు అందిన కాలేజీల ఫైళ్లను మంత్రి వద్దకు తీసుకెళ్లి మరీ సంతకాలు చేయించి వసూళ్లు చేస్తున్నట్లు కాలేజీల యాజమాన్య ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
 
 ముడుపులు అందకపోతే ఏదో ఒక పేపరు మిస్సింగ్...
 నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్న కాలేజీల రెన్యువల్ ఫైళ్లు కూడా తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరులకు ముడుపులు ఇవ్వకపోతే ఆ కాలేజీకి సంబంధించిన ఫైలులోని ఏదో ఒక పేపరును తొలగించి... తగిన పత్రాలు లేవనే సాకుతో ఆ ఫైళ్లను పక్కనబెట్టి ఇబ్బందులపాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముడుపులు ముట్టిన కాలేజీలకు సంబంధించిన ఫైళ్లను మాత్రమే క్లియర్ చేస్తూ, ముడుపులు ఇవ్వని కాలేజీల ఫైళ్లను పక్కనపడేస్తూ యాజ మాన్యాల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement