సాక్షి, పులివెందుల : కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్(బీసీ) వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజకుళ్లాయప్ప పులివెందుల పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో నివాసముంటున్నాడు. మంగళవారం ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని రాజకుళ్లాయప్ప ఇంటితోపాటు మరో రెండు చోట్ల, పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఒకచోట, వేంపల్లెకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒకచోట ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. ఈ దాడులలో రాజకుళ్లాయప్ప ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సోదాలు నిరంతరాయంగా కొనసాగాయి.
సోదాలలో వేంపల్లె వద్ద 16ఎకరాల వ్యవసాయ క్షేత్రం, ముద్దనూరు మండలం ఉప్పరపల్లె గ్రామం వద్ద 7ఎకరాలు, నల్లపురెడ్డిపల్లెలో 4ఎకరాలు, పులివెందుల, ఎర్రబల్లె ప్రాంతాలలో పలు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.20కోట్ల అక్రమాస్తులు రాజకుళ్లాయప్ప కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ రాజకుళ్లాయప్ప ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సోదాలలో రాజకుళ్లాయప్పకు 12చోట్ల ప్లాట్లు, ఇళ్లులు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇవేకాకుండా 5.50ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉందన్నారు. ఇటీవలే రాజకుళ్లాయప్ప దాదాపు రూ.3.94కోట్లు అప్పులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. అలాగే రాజకుళ్లాయప్ప రూ.51లక్షలు అప్పులు ఇచ్చినట్లు వెల్లడైందన్నారు. అంతేకాకుండా రాజకుళ్లాయప్ప ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌ల లాకర్లలో 600గ్రాముల బంగారం, బొలేరో వాహనం, బుల్లెట్ వాహనం, రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.6కోట్లు ఉంటుందని.. మార్కెట్ విలువ ప్రకారం రూ.20కోట్లు అవుతుందని ఆయన తెలిపారు.
రాజకుళ్లాయప్ప గతంలో పులివెందుల ఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె బీసీ హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వర్తించేవారు. అప్పట్లో హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున గోల్‌మాల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులలో ఏసీబీ డీఎస్పీ నాగరాజుతోపాటు కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, కడప ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామచంద్ర, సుధాకర్, కర్నూలు ఏసీబీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణంతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment