భూ ఆర్డినెన్స్‌పై హజారే సమరం
జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజుల దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు అన్యాయం చేసే భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని గాంధేయవాది అన్నా హజారే డిమాండ్ చేశారు. ఆంగ్లేయుల హయాంలో కూడా రైతులకు ఇంతటి అన్యాయం జరగలేదని, వారి పాలనలో కంటే దారుణమైన ఆర్డినెన్సును మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకొని, భూసేకరణ చట్టం-2013లోనే రైతుకు మరింత మేలు చేకూర్చే అంశాలను జోడించి మంచి చట్టం తేవాలన్నారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయకుంటే మూడు, నాలుగు నెలలు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి జైల్‌భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భూసేకరణపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన సోమవారం జంతర్ మంతర్ వద్ద రెండ్రోజుల నిరసన దీక్ష ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ రైతులకు ఎప్పుడూ ఇలాంటి అన్యాయం జరిగి ఉండకపోవచ్చు.
ఈ అప్రజాస్వామ్యకమైన ఆర్డినెన్స్‌ను అమలు చేయడమంటే రైతుల భూమిని ప్రభుత్వం కబ్జా చేయడమే. బ్రిటిష్ పాలకులు కూడా మన రైతులకు ఇంత అన్యాయం ఎప్పుడూ చేయలేదు. అధికారంలో కాంగ్రెస్, విపక్షంలో మీరు(బీజేపీ) ఉండగా ఇద్దరూ కలిసి 2013లో భూసేకరణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు మీ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక అకస్మాత్తుగా ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది రైతులకు తీరని అన్యాయం చేయడమే’ అని అన్నారు. ‘ఎన్నికల ముందు మంచిరోజులు తెస్తామన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు. కానీ ఇప్పుడు నిర్భందంగా రైతుల భూములను పారిశ్రామికవేత్తలకిస్త్తున్నారు. మంచిరోజులు ప్రజలకు రాలేదు. కార్పొరేట్లకే వచ్చాయి’ అని అన్నారు.
రెండో స్వతంత్ర పోరాటం.. ‘భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించాక ప్రజలే యజమానులని, ప్రభుత్వం సేవకుడని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది తలకిందులైంది. ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతీ జిల్లాకు తీసుకువెళ్తా. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుల నుంచి వారి అనుమతి లేకుండా భూమిని ఎలా లాక్కుంటారు’ అని హజారే నిలదీశారు. రైతులకు జరగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి జైలుకెళ్లడానికీ సిద్ధమేనన్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది రాలేగావ్ సిద్ధినమూనా అని, గుజరాత్ నమూనాఅభివృద్ధి కాదన్నారు.
అన్నాతో కేజ్రీవాల్ భేటీ..
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సదన్‌లో అన్నా హజారేను కలుసుకున్నారు. ఇద్దరూ గంటపాటు చర్చించారు. అనంతరం కేజ్రీవాల్ సన్నిహితుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ... మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా దీక్షలో కూర్చుంటారని తెలిపారు.