ప్రజా వ్యతిరేకతతో తోకముడిచిన భూ సేకరణ | Public opposition to the acquisition of the land | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేకతతో తోకముడిచిన భూ సేకరణ

Published Sat, Aug 29 2015 3:08 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

Public opposition to the acquisition of the land

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్సు సహజ మరణం పొందబోతున్నది. ఈ ఆర్డినెన్స్ గడువు ఈ నెల 31న ముగియనున్నది. మరోసారి ఆర్డినెన్సును ప్రయోగించే ఉద్దేశం లేనట్టు కేంద్రం నుంచి శుక్రవారం నాడు సంకేతాలు అందాయి. ఈ సంకేతాలు అందడమే తరువాయి, రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ రాజధాని భూముల కోసం జారీ చేసిన భూసేకరణ ఉత్తర్వులను పక్కనబెట్టినట్టేనని, భూసమీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.

ఎందుకంటే కేంద్రం ఆర్డినెన్సును ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజా వ్యతిరేకతకు తలవొగ్గిన కేంద్రం మరోసారి ఆర్డినెన్సు జారీకి సుముఖంగా లేదన్న విషయం తెలవడంతోనే రాష్ట్ర మంత్రి నారాయణ హడావుడిగా విజయవాడలో విలేకరుల సమావేశం పెట్టారు. రాష్ట్రంలో కూడా భూసేకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన ధర్నా విజయవంతం కావడంతోపాటు రైతుల్లో ఆ పార్టీ ప్రతిష్ట పెరగడం కూడా అధికార పక్షానికి ఇబ్బంది కలిగించింది.

ఈ నేపథ్యంలో ఆర్డినెన్సు సహజ మరణానికి మూడు రోజుల ముందుగానే అస్త్ర సన్యాసానికి సిద్ధమైన ప్రభుత్వం మంత్రి నారాయణ ద్వారా ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ దక్కకుండా చూసే ప్రయత్నం చేసింది. భూసేకరణ వ్యవహారం ముఖ్యమంత్రికి కూడా ఇష్టం లేదనీ, తానే ఆ ఉత్తర్వులు ఇచ్చానని నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిం చిన ప్రతిపక్షనేత విషయం పక్కకు పెట్టి, కేవలం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వల్లనే భూ సేకరణను మానుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షం ఖాతాలో కాకుండా తమ మిత్రుడైన పవన్ ఖాతాలోకి మళ్లించడానికి మంత్రి ప్రయాసపడ్డారు.
 
విజయవాడలో మంత్రి ఏమన్నారంటే...
‘జనవరి 2న ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) ప్రకటించి ఫిబ్రవరి 28 నాటికి 58 రోజుల్లో 33 వేల ఎకరాలు సేకరించాం. మార్చి 1న నేను భూసేకరణ ప్రకటించాను. సీఎంగారు భూసేకరణను ఆపండి.. భూసమీకరణ విధానంలోనే రైతుల నుంచి భూములు తీసుకోమని చెప్పారు. అలా వీలుకాని పక్షంలోనే భూసేకరణకు పోదామన్నారు. ఆ తర్వాత ఈ నెల 20 నాటికి రైతులు భూసమీకరణ ద్వారానే వెయ్యి ఎకరాలు ఇచ్చారు.

రాజధానికి మాస్టర్ ప్లాన్ వచ్చింది కాబట్టి ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నెల 20న నేను భూసేకరణ పెట్టాను. పవన్‌కళ్యాణ్ ఇక్కడి వచ్చి ప్రభుత్వం భూసేకరణకు పోవద్దు, భూసమీకరణ విధానంలో రైతులను ఒప్పించి భూములను తీసుకోమని చెప్పారు. అందుకే మేం ఇప్పుడు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నాం. నచ్చచెప్పే తీసుకుంటాం. భూసేకరణ జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. సీఎంగారు మొదట నుంచి దానికి పూర్తి వ్యతిరేకం. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రకటించాను’ అని ముక్తాయించారు.కాగా ఇదే నారాయణ రాత్రికి మాట మార్చారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రభుత్వ నిర్ణయమేనని అన్నారు.
 
మంత్రి గారి డ్రామా
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అసలు భూ సేకరణ చట్టం ప్రయోగించాలన్న నిర్ణయంలో ముఖ్యమంత్రి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. నిజానికి భూసేకరణ చట్టం ప్రయోగించడానికి సంబంధించి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 304, తేదీ 20-08-2015) జారీ చేసింది.

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఈ జీవో ద్వారా భూ సేకరణ కోసం 26 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. వాస్తవం ఇలావుంటే, మంత్రి మాత్రం భూసేకరణకు ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదని బుకాయిం చారు. పెపైచ్చు అంతటి కీలకమైన నిర్ణయం విషయంలో సీఎంకు సంబంధం లేకుండానే తానే నోటిఫికేషన్ జారీ చేయమని అధికారులను ఆదేశించినట్టు విచిత్రమైన వాదన వినిపించారు.
 
మరో ‘భూ’ ఆర్డినెన్స్ ఉండదు!
బదులుగా సంబంధిత 13 చట్టాలను భూ సేకరణ చట్టం 2013లో చేర్చిన కేంద్రం
 న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో నాలుగోసారి భూ సేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అందుకు బదులుగా, జాతీయ రహదారులు, రైల్వేల చట్టం లాంటి భూ సేకరణకు సంబంధించిన 13 చట్టాలను యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 నాటి భూ సేకరణ చట్టంలో చేరుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో భూ సేకరణ ప్రక్రియలో భాగంగా భూములు ఇచ్చినవారికి ఆ 13 చట్టాల ద్వారా లభించే.. పరిహార నిర్ణయం, పునరావాసం తదితర ప్రయోజనాలు అందనున్నాయి. భూ సేకరణ చట్టంలోని ‘ఇబ్బందుల తొలగింపు నిబంధన(రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ క్లాజ్ - సెక్షన్ 113)’ కింద కేంద్రం ఈ ‘ఆర్డర్’ జారీ చేసింది. దీంతో భూ సేకరణ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉండదు.  ప్రస్తుత ఆర్డినెన్స్ కాల పరిమితి ఈ నెల 31తో ముగుస్తుంది.  

ఈ 13 చట్టాలను తాము అమల్లోకి తెచ్చిన భూ సేకరణ చట్టంలో యూపీఏ చేర్చలేదు. కానీ, భూ సేకరణ చట్టం ఆమోదం పొందే సమయంలో సంవత్సరంలోగా ఈ 13 చట్టాలను ఆ చట్ట పరిధిలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయితే, తాము రూపొందించిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ల్లో ఆ 13 చట్టాలను ఎన్డీయే చేర్చింది.

ఈ తరహా ఉత్తర్వుల జారీకి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుముఖంగా ఉండగా, న్యాయ శాఖ మాత్రం ఆర్డినెన్స్ ద్వారానే ఆ 13 చట్టాలను భూ సేకరణ చట్ట పరిధిలోకి తీసుకురావాలని సూచిస్తోంది. భూ సేకరణ ఆర్డినెన్స్ మరోసారి జారీ చేయాలన్న ఆలోచన నుంచి విరమించుకున్నందున, పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో, జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మరోసారి వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement