అడుగడుగునా అణచివేతే! | Illegal cases and arrests are being if spoken against the govt | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అణచివేతే!

Published Mon, Apr 29 2019 4:16 AM | Last Updated on Mon, Apr 29 2019 9:11 AM

Illegal cases and arrests are being if spoken against the govt - Sakshi

సచివాలయం వద్ద తన పొలంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకున్న రైతును అరెస్టు చేసి ఈడ్చుకెళ్తున్న పోలీసులు (ఫైల్‌)

ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికారులే టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారు. టీడీపీ నాయకులు తానా అంటే తందానా అన్నట్టు రాజధాని ప్రాంతంలో అధికార వ్యవస్థ తయారైంది. రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల భూములు లాక్కోవడం దగ్గర నుంచి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అక్రమ కేసులు పెడుతూ ఎక్కడికక్కడ భయాందోళన పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రజా ఉద్యమాలను అడుగడుగునా అణచివేస్తున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వని భూమిలో రహదారి నిర్మించడానికి తాజాగా ప్రభుత్వ పెద్దలు పోలీస్‌ వ్యవస్థని వాడుకున్న తీరుపై రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
– తుళ్లూరు(తాడికొండ)

భూములివ్వని రైతులే టార్గెట్‌.. 
రాజధానికి భూములు సేకరించేటప్పుడు టీడీపీ ప్రభుత్వం భూములివ్వని రైతులనే టార్గెట్‌ చేస్తూ చివరకు పంట పొలాలను తగలబెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఈ విషయంలో లింగాయపాలెం గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ చౌదరిని పోలీసులు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా రోజుకొక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పది రోజుల పాటు నిర్బంధించి ముప్పుతిప్పలు పెట్టారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందిగం సురేష్‌ కూడా రాజధాని ప్రకటన సమయంలో సామాన్య కార్యకర్తగా ఉన్నారు. ఇదే విషయంలో పోలీసులు ఆయన్ని కూడా అక్రమంగా అరెస్టు చేసి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే పొలాలకు నిప్పుపెట్టినట్టు ఒప్పుకోవాలని కర్రలు విరిగేలా కొట్టించారు. కుటుంబ సభ్యులను దూషిస్తూ మానసికంగా వేధించారు. ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రైతులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. 

దళితులు ప్రశ్నిస్తే అణచివేయడమే! 
దళిత ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిని అణచివేసేందుకు కూడా పోలీస్‌ వ్యవస్థను వాడుకోవడం ఒక్క టీడీపీ ప్రభుత్వానికే చెల్లుతుందేమో. రాజధానిలో దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు కూడా పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని బాధిత రైతులు గళం విప్పి దీక్షలకు కూర్చుంటే రాత్రికి రాత్రే శిబిరాన్ని కూల్చేసి దీక్షను భగ్నం చేసింది. 2018 ఏప్రిల్‌ 8న శాఖమూరులో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని చూడడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. స్మృతివనంలో ఇటుక కూడా వేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నాడనే విషయం ప్రజలకు తెలుస్తుందని టీడీపీ ప్రభుత్వం గజగజ వణికింది. 

కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. 
వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెనుక సర్వే నంబరు 214/ఏ లో రైతు గద్దె మీరాప్రసాద్‌ పొలంలో నిర్మిస్తున్న ఎన్‌–9 రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినా సీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోలేదు. 2018 ఫిబ్రవరి 25న అర్ధరాత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని సీఆర్‌డీఏ అధికారులు రోడ్డు నిర్మిస్తుండగా.. రైతు తన వద్ద ఉన్న కోర్టు ఉత్తర్వులను చూపి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సీఆర్‌డీఏ అధికారులకు భద్రత కల్పించడమే తమ బాధ్యత అంటూ రైతు మీరాప్రసాద్‌ను పొలంలో నుంచి ఈడ్చుకెళ్లారు. సీఆర్‌డీఏ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో రహదారి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పెద్ద వార్నింగ్‌ ఇస్తూ.. సచివాలయం వెనుక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు వేసి తీరాలి.. 
ఏం చేస్తారో తెలియదు అనడంతో శనివారం 100 మంది పోలీసులను ఏర్పాటు చేసి రైతును అరెస్టు చేయించి 
రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.  

రైతుకు మద్దతు తెలిపితే బెదిరిస్తారా? 
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల గళం నొక్కడానికి, అధికార పార్టీ కార్యకర్తలకు వత్తాసు పలకడానికి, ప్రతిపక్ష కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఇక్కడ అధికారులు కేవలం కీలుబొమ్మలే. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదు. రైతుకు మద్దతుగా వెళితే కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం దారుణం. 
– బత్తుల కిషోర్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, తుళ్లూరు 

పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు 
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు. రాజ్యంగం పట్ల విశ్వాసం లేదు. రాజధాని రైతులను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు కమీషన్ల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య అంటూ బూచిగా చూపించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా పోలీస్‌ శాఖ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. రైతు మీరా ప్రసాద్‌కు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. 
– ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 

నా పొలంలో అనుమతి లేకుండా రోడ్డు 
నా పొలంలో ఎన్‌–9 రోడ్డు నిర్మించొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులను చూపినా అధికారులు పట్టించుకోలేదు. రోడ్డు వేస్తుండగా.. నా పొలంలోకి వెళ్తే పోలీసులు నన్ను ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం. నా పొలంలో నా అనుమతి లేకుండా ప్రభుత్వం పోలీసుల అండతో నాపై కేసు పెట్టి రోడ్డు నిర్మిస్తుందంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఉండదేమో. 
– గద్దె మీరా ప్రసాద్, రాజధాని రైతు, వెలగపూడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement