
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవాలంటూ సీఆర్‌డీఏ కమిషనర్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమంటూ భూ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం విచారణ జరిపారు. సీఆర్‌డీఏ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేశారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేశారు. విజయవాడకు చెందిన కొండేటి గిరిధర్, ఆయన కుమారుడు అఖిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. ప్లాట్ బదలాయింపు హక్కుతో సహా భూ సమీకరణ యాజమాన్య ధృవీకరణ పత్రాలను భూ యజమానులకు ఇవ్వాల్సిన బాధ్యత సీఆర్‌డీఏపై ఉందన్నారు. ఈ బాధ్యతలేవీ సీఆర్‌డీఏ నిర్వర్తించడంలేదని తెలిపారు.