ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్న రైతులు
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంత రైతుల్లో ప్రభుత్వం మళ్లీ అలజడి సృష్టిస్తోంది. సర్వేలంటూ, హైటెన్షన్ వైర్లంటూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే భూ సమీకరణతో వేలాది ఎకరాలను బీడు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొరగా మిగిలిన భూముల్లో కూడా పంటలు సాగుచేసుకోనివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంట పొలాల మీదుగా హైటెన్షన్ వైర్లు లాగడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్థలాల్లో గానీ, ఇళ్ల మీదుగా కానీ ఇలాంటి విద్యుత్ వైర్లు వేయగలరా? అంటూ అధికారులను నిలదీశారు. అయినా కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు బెదిరించారు. వివరాలు.. రాజధాని ప్రాంతం ముంపునకు గురవకుండా ఇరిగేషన్ శాఖ రూ.240 కోట్లతో కృష్ణానదిపై కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం నులకపేట 130 కె.వి సబ్‌స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు.
కొండవీటి వాగు వద్దకు వచ్చేసరికి రైతుల పంట పొలాలు, స్థలాల మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైతులు గతంలో కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో తాత్కాలికంగా పనులు విరమించిన ఇరిగేషన్ శాఖ అధికారులు.. మళ్లీ మంగళవారం రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొలాల్లోంచి హైటెన్షన్ వైర్లను లాగడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. ఎక్కడో పైన వెళ్లే వైర్లను ఆపడానికి మీరెవరంటూ రైతులను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా.. మీ స్థలాలు, ఇళ్ల మీదుగా ఇలాంటి భారీ కరెంటు వైర్లు వెళుతుంటే ఊరుకుంటారా అంటూ నిలదీశారు.
ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూములను ఐదారుగురు పంచుకోవాల్సి ఉందని, ఇది అగ్రికల్చరల్ భూమి కాదని.. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదంటూ అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వబోమంటూ గతంలో కోర్టును ఆశ్రయించామని.. అలాంటి భూముల్లో ఎలా వైర్లు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. రైతులను అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మా పొలాల మీదుగా వైర్లు లాగితే వాటికే ఉరేసుకొని చస్తామని రైతులు స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
మెట్రో రైల్ సర్వే కోసమంటూ..
మైట్రో రైల్ సర్వే కోసమంటూ వచ్చి హడావుడి చేసిన కొందర్ని ఉండవల్లి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. ఓ సర్వే సంస్థకు చెందిన బృందం మంగళవారం ఉదయం పొలాలను ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ తిరుగుతుండటంతో.. అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వారిని నిలదీశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులున్నాయని.. అడ్డుకుంటే అడ్డుకుంటే ఇబ్బందులు పడతారంటూ వారు బెదిరింపులకు దిగారు. దీంతో రైతులు వారిని పొలాల్లోంచి బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఇంతలో ఈ విషయం తెలిసిన గ్రామ రైతులు భారీగా అక్కడకు చేరుకున్నారు. తాము ప్రభుత్వానికి భూములివ్వలేదని.. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున సర్వే చేయవద్దంటూ వారికి తేల్చిచెప్పారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. వారిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. మళ్లీ వస్తే కేసులు పెడతామంటూ రైతులు సర్వే బృందాన్ని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment