బలవంతపు భూసేకరణపై ప్రత్యక్ష పోరు | Forced land acquisition On Direct confrontation | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణపై ప్రత్యక్ష పోరు

Published Sat, Mar 5 2016 2:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Forced land acquisition On Direct confrontation

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని పేరిట జరుగుతున్న బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) నిర్ణయించింది. చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాల సారవంతమైన భూముల్ని  రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ధ్వజమెత్తింది. సంఘం 29వ జాతీయ మహాసభల్లో భాగం గా శుక్రవారం ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై చర్చ జరిగింది. రైతులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ ఖరారు చేయాలని తీర్మానించింది.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి అనుగుణంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. ఏపీలో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి గుంజుకుని కార్పొరేట్ శక్తులకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెడుతోందని, రైతులకు కనీస పరిహారం కూడా చెల్లించడం లేదని ఏపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంక్ పేరిట పేదల భూములకు ఎసరు పెడుతోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు వివరించారు.
 
రైతులకు పెన్షన్ ఇవ్వాలి
50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది. పంటలు పండక, అప్పుల ఊబిలో చిక్కుకుని తల్లడిల్లుతున్న రైతును ఆదుకోవడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని తీర్మానించింది. కేంద్రబడ్జెట్‌లో వ్యవసాయానికి తీరని అన్యాయం జరిగిందని, వడ్డీ రాయితీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడాన్ని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో సుమారు ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతు కుటుం బాన్నీ కేంద్రం ఆదుకోలేదని అతుల్‌కుమార్ అంజన్ ఆరోపించారు.

పార్లమెంటులో గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తున్న పార్టీలు రైతు ఆత్మహత్యలపై కనీసం గంట సేపూ చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. నివేదికపై మాట్లాడిన వారిలో రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, గుండా మల్లేష్, ప్రబోధ్ పాండా తదితరులున్నారు. మహాసభ సందర్భంగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణమండపంలో ‘వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు, రాయితీలు’ అంశంపై జరిగే జాతీయ సదస్సుకు ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ హాజరవుతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement