రాజధానికి వేలాది ఎకరాలు కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకే ..?
రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటున్న ప్రభుత్వం
భయపడి ఇచ్చామంటున్న అన్నదాతలు..
న్యాయస్థానాలను ఆశ్రయించి భూములు కాపాడుకునే యత్నం
రాజధానికి భూ సమీకరణ ప్రక్రియ రైతుల పాలిట శాపంగా మారింది. స్వచ్ఛందంగా భూమిలిచ్చారని ముఖ్యమంత్రి బాబు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అన్నదాతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నయానో, భయానో 12,450 మంది రైతుల నుంచి 30,400 ఎకరాలు ప్రభుత్వం సమీకరించింది. ఇందులో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని ఢంకా భజాయిస్తోంది. రైతులకు మేలైన ప్యాకేజీ ఇస్తామంటోంది. వృత్తి నైపుణ్యశిక్షణ చేపడతాం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. అంటూ ఏవేవో చెబుతోంది. వీటన్నిటినీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే రైతులు వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు, సామాజికవేత్తలు, న్యాయస్థానాలను ఆశ్రయించి భూములు కాపాడుకునే యత్నాలు చేశారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని నిర్మాణానికి తుళ్ళూరు మండలంలోని కొందరు మినహా ఇతర రైతులు ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ రకాల ఒత్తిడులకు భయపడి భూములు ఇచ్చారనేది వాస్తవం. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యమనేతల సూచనలు, రైతుల ఆక్రందనలు వినిపించలేదు. 30,400 ఎకరాలను ఇచ్చిన రైతులకు కౌలు చెక్కుల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఇప్పటివరకు 18,200 ఎకరాల రైతులకు మాత్రమే చెక్‌లు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే కౌలు చెక్కులను ఆ రుణాలకు జమ చేస్తుండటంతో చేతిలో చిల్లిగవ్వలేక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ కంఠాల్లోని స్థలాలు, గ్రామానికి అరకిలోమీటరు దాటిన వ్యవసాయ భూములను అమ్ముకునే అవకాశం లేక రైతులు తల్లిడిల్లిపోతున్నారు.
వృత్తి కార్మికుల పరిస్థితి అధ్వానం..
దీంతో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 39,509 వ్యవసాయ కార్మికులు, వివిధ వృత్తులకు చెందిన 16,654 మంది కార్మికులు మూడునెలల నుంచి ఉపాధి కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని కుమ్మరి, వడ్రంగి వంటి చేతి వృత్తిపనివారు ఇంట్లో ఉండి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదించేవారు. ఉపాధి కోల్పోయిన వీరికి నెలకు రూ.2,500 అందిస్తామని, మే నెలలో ఇది ప్రారంభం ప్రకటించారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి రెండునెలల సమయం పడుతుందని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు.
ఉద్యమ బాట..
రాజధాని నిర్మాణానికి పచ్చని భూములను తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చర్చించారు. అంతేకాక ఆ పార్టీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులను రాజధాని గ్రామాలకు పంపించి రైతుకు భరోసా కలిగించారు. భూ సమీకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివిధ రకాల ఉద్యమాలు నడిపారు. న్యాయపోరాటం చేసే రైతులకు సహకారం అందించారు. సామాజిక ఉద్యమనేత మేథాపాట్కర్ వంటి అనేకమంది ఉద్యమకారులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కలిగించారు.
నదీ పరీవాహక ప్రాంతంలో..
మంగళగిరి నియోజకవర్గంలోని నదిపరివాహక ప్రాంతాల రైతుల పరిస్థితి ఒక్కసారిగా తల్లికిందులైంది. సాలీనా మూడు పంటలు పండే భూములున్న జరీబు రైతులు ఎకరాకు రూ.లక్ష కౌలును పొందేవారు. ఆ భూముల ధరలు కూడా ఎకరా రూ.5 కోట్ల వరకు ఉండేది. వారంతా చంద్రబాబు విదిల్చే కౌలు మొత్తాలకు ఆశపడక న్యాయపోరాటం చేస్తున్నారు. వీరిని బెదిరించేందుకు భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్టు నోటిషికేషన్ జారీ చేసిన ప్రభుత్వం దానిని అమలు పరచకుండానే భూ సమీకరణలో రైతుల నుంచి భూములు తీసుకునే యత్నం చేస్తోంది.
భూఫార్స్
Published Sun, May 31 2015 4:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement