ఇది ప్రభుత్వ దోపిడీయే! | Cotton farmers fires on Govt: Calls to chalo Delhi | Sakshi
Sakshi News home page

ఇది ప్రభుత్వ దోపిడీయే!

Published Thu, Nov 2 2017 2:17 AM | Last Updated on Thu, Nov 2 2017 2:23 AM

Cotton farmers fires on Govt: Calls to chalo Delhi - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రకృతి సహకరించక, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు వ్యాపారుల మాయాజాలం మరింత వేదన కలిగిస్తోంది. సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, వ్యాపారులు నానా సాకులు చెబుతూ అతితక్కువ ధర చెల్లిస్తుండటంతో కడుపు మండిన రైతన్న ఆందోళనకు దిగుతున్నాడు. అసలు ప్రభుత్వమే తమ వద్ద దోచుకుంటోందంటూ మండిప డుతున్నాడు. బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో రైతులు.. తమ ఆవేదనను, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా నిరసన తెలిపారు.

‘పత్తి ధరలపై బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన ధర ఎంత? ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఎంత? క్షేత్రస్థాయిలో ఈ రోజు తమ పత్తికి పలికిన ధర ఎంత? తాము నష్టపోయిన మొత్తం ఎంత?’ అనే వివరాలతోపాటు ఈ నష్టాన్ని ప్రభుత్వం దోచుకున్న ట్లేనంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో వినూత్నంగా ప్రదర్శించా రు. ఆరుగాలం శ్రమించి ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్కై అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాపారుల ఇష్టారాజ్యం
వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) అంచనా ప్రకారం క్వింటాల్‌ దిగుబడికి ఖర్చు ఎంత అవుతుందో దానికి 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలి. పత్తికి రూ.6,564 గిట్టుబాట ధర వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని స్వామినాథన్‌ కమిషన్‌ కూడా పేర్కొంది. ఈ రెండు అంశాలను గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించిం ది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై మూడున్న రేళ్లు దాటిపోతున్నా ఇవేవీ అమల్లోకి రాలేదు.

ఇక ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ.4,320 మద్దతు ధర (ఎంఎస్‌పీ)గా ప్రకటించింది. అయితే ఇందులోనూ పత్తి నాణ్యత, తేమ శాతంపై సీసీఐ అడ్డగోలు నిబంధనలు విధించింది. రైతులు తెస్తున్న పత్తి ఆ నిబంధనల ప్రకారం లేదంటూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నారు. కేవలం రూ.1,500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. పూర్తి నాణ్యౖ మెన, నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి కూడా గరిష్టంగా రూ.4,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ హామీలు, వాస్తవాలపై ఆందోళన
రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 20న ‘ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. దీనిపై ప్రధాని మోదీని లెక్కలు అడుగుదాం’ అనే నినాదంతో ఢిల్లీలో కిసాన్‌ ముక్తియాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ,  ఏపీల్లోని ప్రధాన మార్కెట్లలో ముక్తి వికాస్, మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలతోపాటు సుమారు 40 ప్రజా సంఘాల నాయకులు పత్తి రైతుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట మార్కెట్లో పత్తికి మద్దతు ధర అమలు, కొనుగోళ్ల తీరుపై పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల దోపిడీపై రైతులతో కలసి నిరసన తెలుపుతు న్నారు.

‘ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటోంది’ అనే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయా రైతుల పేర్లు, గ్రామం, తెచ్చిన పత్తి, చెల్లించిన ధర, స్వామినాథన్‌ నివేదిక ఆధారం గా అందాల్సిన ధర, మద్దతు ధర, ప్రభుత్వం దోచుకున్నది ఎంత..’’ అనే వివరాలు రాస్తున్నారు. మొత్తంగా ‘కిసాన్‌ ముక్తియాత్ర’ కార్యక్రమానికి ఐదు వేల మంది రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నేతలు వెళ్లనున్నారు.

ఈ చిత్రంలో ఆవేదనతో కనిపిస్తున్న మహిళా రైతు ఉనుగూరి కమల. జయశంకర్‌ జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. ఆమె ఖరీఫ్‌లో ఆరెకరాల్లో పత్తి సాగు చేసింది. గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. 65 మంది కూలీలతో పత్తి ఏరితే 11 బస్తాలు (7 క్వింటాళ్లు) వచ్చింది. దానిని బుధవారం జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చింది. వ్యాపారులు ఆ పత్తిని పరిశీలించి.. కాయ, తేమ ఉందని, గుడ్డి పత్తి అంటూ క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున మాత్రమే చెల్లించారు. అంత తక్కువ ధర చెల్లించడంతో కమల కన్నీరు పెట్టుకుంది. పత్తి ఏరిన కూలీల కోసమే రూ.15 వేలు ఖర్చయింది. దానిని అమ్మితే రూ.10,500 మాత్రమే చేతికి వచ్చాయంటూ ఆవేదనకు గురైంది. అటు మూడెకరాల్లో వరి సాగు చేస్తే దోమపోటు సోకి దెబ్బతిన్నదని విలపించింది. సాగును నమ్ముకుంటే అప్పులు, కన్నీళ్లే మిగిలాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

రైతులకు పంట నష్టం చెల్లించాలి
‘‘ప్రభుత్వం హామీ ఇచ్చిన ధర కాకుండా ఎంఎస్‌పీని ప్రకటించింది. అది కూడా అందని పరిస్థితి ఉంది. అకాల వర్షాలతో పత్తి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ధరను వెంటనే అమల్లోకి తేవాలి. బుధవారం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఒక్క రైతు వద్ద కూడా కొనుగోలు చేయకుండా ట్రేడర్స్‌కు వదిలేశారు. సీసీఐ కంటే ట్రేడర్సే ఎక్కువ ధర చెల్లిస్తున్నారంటూ బుకాయిస్తున్నారు. నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి..’’ – విస్స కిరణ్‌కుమార్,రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement