Minimum Price
-
5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల కనీస ధరను 35 శాతం మేర తగ్గించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. 5జీ మొబైల్ సర్వీసులకు ఉపయోగించే 3300–3670 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం రేటును మెగాహెట్జ్‌కు రూ. 317 కోట్లుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ట్రాయ్ గతంలో సూచించిన రూ. 492 కోట్లతో (మెగాహెట్జ్‌కు) పోలిస్తే ఇది సుమారు 35 శాతం తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కీలకమైన 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు సంబంధించి బేస్ రేటును గతంలో ప్రతిపాదించిన దానికన్నా 40 శాతం తక్కువగా రూ. 3,927 కోట్లుగా నిర్ణయించవచ్చని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 700 మెగాహెట్జ్ మొదలుకుని 2500 మెగాహెట్జ్ వరకూ ఉన్న ప్రస్తుత ఫ్రీక్వెన్సీలతో పాటు కొత్తగా చేర్చిన 600, 3300–3670, 24.25–28.5 మెగాహెట్జ్ బ్యాండ్లను కూడా వేలంలో విక్రయించనున్నట్లు వివరించింది. టెలికం రంగం నిలదొక్కుకోవడానికి, దీర్ఘకాలంలో వృద్ధి సాదించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడం, ద్రవ్య లభ్యతను పెంచడం, స్పెక్ట్రం కోసం సులభతర చెల్లింపుల విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ తెలిపింది. అత్యంత వేగవంతమైన 5జీ మొబైల్ సర్వీసులను 2022–23 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
టమాటా రైతు 'పంట' పండింది
సాక్షి, అమరావతి: మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టమాటా మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం కిలో రూ.2–4 మధ్య పలికిన ధర నేడు రూ.7–14ల మధ్య పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వచ్చే కొద్దిరోజుల్లో లాక్డౌన్ సడలింపులతో ఎగుమతులు పుంజుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. టమాటా పంట రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,090 హెక్టార్లు, అనంతపురంలో 19,340 హెక్టార్లు, కర్నూలులో 3,203 హెక్టార్లలో సాగవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 22.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తుంది. ఇలా మార్కెట్‌కు వచ్చే టమాటాలో మూడొంతులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకే పరిమితమైన ఎగుమతులు మంగళవారం పది రాష్ట్రాలకు పెరిగింది. మరో నాలుగు రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వేలం పాటల్లో మార్కెటింగ్ శాఖ.. నిజానికి.. కరోనావల్ల ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎగుమతుల్లేక, మార్కెట్లో ధరలేక కిలో టమాటా రూ.2–4కు మించి ధర పలకలేదు. ఈ దశలో ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర తక్కువగా ఉన్న మార్కెట్లలో వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొంది. ఇలా కిలో రూ.5–7 చొప్పున రూ.11లక్షలు వెచ్చించి 52 మంది రైతుల నుంచి సుమారు 130.39 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం రైతుబజార్ల ద్వారా విక్రయాలు జరిపింది. మరోవైపు.. ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా 410 మంది రైతుల నుంచి రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా కిలో రూ.4కు మించి పలకని టమాటా ధర ప్రస్తుతం గరిష్టంగా రూ.14లు పలుకుతోంది. జాతీయ స్థాయిలో టమాటా మార్కెట్‌గా పేరొందిన మదనపల్లెతో పాటు పలమనేరు, మలకల చెరువు మార్కెట్ యార్డుల్లో టమాటా రైతుకు నేడు మంచి రేటు వస్తోంది. కనిష్ట, గరిష్ట ధరలిలా.. ► మదనపల్లె మార్కెట్ యార్డులో మంగళవారం మొదటి రకం టమాటా కిలో కనిష్టం రూ.11, గరిష్టం రూ.14.. రెండో రకం కనిష్టం రూ.7, గరిష్టం రూ.10 పలికింది. ► అలాగే, పలమనేరు మార్కెట్ యార్డులో రెండో రకం కనిష్టం రూ.9, గరిష్టం రూ.12 ధర పలికింది. ► మలకలచెరువు మార్కెట్ యార్డులో కిలో కనిష్టంగా రూ.7, గరిష్టంగా 10 పలికింది. ఈ మూడు మార్కెట్ యార్డులకు సగటున రోజుకు 2వేల టన్నుల చొప్పున టమాటా వస్తోంది. రైతుల వద్ద మరో 10 లక్షల టన్నుల టమాటా ఉన్నట్లు అంచనా. ► ఇదిలా ఉంటే.. టమాటా ధరలు ఈనెలాఖరులో భారీగా పెరిగే సూచనలు ఉన్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాలకు ఎగుమతులు మొదలైతే వ్యాపారుల మధ్య పోటీతో ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం జోక్యంవల్లే.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంవల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఒకసారి పతనమైతే మళ్లీ పెరిగిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈసారి కిలో రూ.2–4ల మధ్య ప్రారంభమైన ధర నేడు కిలో రూ.14లు పలుకుతోంది. మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ ఇది నిజంగా శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మదనపల్లె మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతోంది. 10 కిలోల టమాటా 1వ రకం గరిష్టంగా రూ.140 పలకడం నిజంగా శుభపరిణామం. ప్రస్తుతం సాగు రకాల్లో 1వ రకం టమాటా 60 శాతం కంటే ఎక్కువగా సాగవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు
అన్ని పంటల్లాగే పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. మార్కెట్‌కు వచ్చిన అన్ని రకాల పొగాకుకు కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి. ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలి. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలి. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలి. పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్ చేసే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. వ్యాపారాలు చేయని వారి లైసెన్స్‌లను తొలగించాలి. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్‌లు ఎందుకు? ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుంది. సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు మేలు జరిగేలా కనీస ధర ప్రకటించి, ఆపై ధరలకే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్లో పొగాకు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు రైతుల సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పటికప్పుడే స్పందిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లైసెన్స్ తీసుకున్నారంటే కొనుగోలు చేయాల్సిందే ► ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. అరటి, మొక్క జొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కరోనా సమయంలో కూడా భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశాం. ► పొగాకును కూడా అలాగే కొనాలి. పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. లైసెన్స్‌లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి. ► ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కెట్లో జోక్యం కోసం రెండు మూడు రోజుల్లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్ తీసుకుంటుంది. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుంది. ► బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుంది. ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుంది. ► పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలి. అలాగే లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వేలం కేంద్రాల వద్ద ప్రతిరోజూ కొనుగోలు చేయాలి. వేలం జరిగే అన్ని రోజులూ పాల్గొనాలి. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పొగాకును వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ► రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది మా అజెండా. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపారులు రింగ్ కాకుండా చూడాలి ► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది. మార్కెట్లో పోటీతత్వం పెంచింది. రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది. దీన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి. ► ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉంది. లక్ష్యాల మేరకే పంట సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారు. ► 920 మందికి లైసెన్స్‌లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదు. వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు వేలం కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ► వ్యాపారులు ఒక రింగులా ఏర్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాల్సిందే. మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలి. ► రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. ► రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే మీరు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదు. తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు. కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుంది. ► ప్రాసెస్ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతో కాలం సరుకును నిల్వ చేసుకోలేడు. చివరకు వ్యాపారులు రింగ్ అవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ► పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇండెంట్ ఇచ్చి, తమ చేత పంట పండించి.. చివరకు వేలం కేంద్రం వద్దకు వ్యాపారులు రావడం లేదని వాపోయారు. కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు ధరలు తగ్గిపోయాయన్నారు. ► గడువు ముగిసినా.. వారం.. పది రోజులు అంటూ కొనుగోలు చేయడం లేదన్నారు. వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.1.4 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ► కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు, ఎగుమతుల రూపంలో మరో రూ.6 వేల కోట్ల ఆదాయం పొగాకు ద్వారా వస్తోంది. రైతులకు మాత్రం అప్పులు తప్పడం లేదన్నారు. ఒక ఏడాది పెట్టబడులు వస్తే.. వరుసగా ఆరేళ్లు నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ► పొగాకు కొనుగోలు కోసం రిజిస్టర్ చేసిన కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం లేదని.. మీడియం, లోగ్రేడ్ పొగాకు రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ► ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్‌దారులంతా వేలంలో పాల్గొనాల్సిందే లైసెన్స్ తీసుకొని పంట సాగు చేసిన రైతు నష్టపోకుండా ఉండే విధంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేçస్తున్నాం. కొంతమంది లైసెన్స్‌దారులు కంపెనీలతో కుమ్మక్కయి రైతులు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా చేయడం ఇకపై సాధ్యం కాదు. ఇక నుంచి ప్రతీ లైసెన్స్‌దారుడు విధిగా వేలంలో పాల్గొనే విధంగా నిబంధన తీసుకువస్తాం. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌గా స్థానిక రైతులనే నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా ఇంచార్జిమంత్రి గౌరవ అధ్యక్షులుగా, మండల కమిటీలకు స్థానిక ఎమ్మల్యేలు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. ఈ కమిటీలో కౌలు రైతు, మహిళా రైతు విధిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
ధాన్యం కొనేవారేరి..?
వీణవంక(హుజూరాబాద్): పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు సాగు చేసిన అన్నదాతలు కల్లాల్లో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ, మగ వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ పండించిన ధాన్యం ఆరేళ్లయినా మొలకెత్తే స్వభావం కలిగి ఉంటుంది. హైబ్రీడ్ వరిని 32 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది మగ వడ్లను ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయకపోవడంతో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించగా.. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి.. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి మగ వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు. అప్పుడు కొనుగోలు చేసిన సంస్థలు మళ్లీ ఈ రబీలో ముఖం చాటేశాయి. కేంద్రాలకు తరలించిన మగ ధాన్యం కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు మగ వడ్లను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్–ఏకు క్వింటాల్‌కు రూ.1770, కామన్ రకం రూ.1750 ఉండగా మిల్లర్లు మగ వడ్లను రూ.1200కే అతికష్టం మీద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో.. మగ(హైబ్రీడ్) ధాన్యం గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. కనీసం గ్రేడ్ బీ(కామన్‌రకం) కింద కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగసంస్థలు చేతులెత్తేశాయి. మగ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి విక్రయించడం సవాల్‌గా మారింది. కొందరు రైతులు గత్యతంరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఆడ వడ్లను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వీటికి మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మగ ధాన్యాన్ని రైతులే మార్కెట్లో అమ్ముకోవాలి. రైతులతో కంపెనీలు ముందస్తుగా అలా ఒప్పందం చేసుకుంటున్నాయి. మార్కెట్లో మగ ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతోపాటు కనీసం కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు. సాగుకు అనుకూలం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45వేల ఎకరాలలో హైబ్రీడ్ వరి సాగులోకి వచ్చింది. ఇందులో 8వేల ఎకరాలు ఎండిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో 40 నుంచి 50 వేల క్వింటాళ్లు మగ ధాన్యం పండినట్లు సమాచారం. ప్రస్తుతం వరి కోతలు 60శాతం పూర్తయ్యాయి. హైబ్రీడ్ వరి సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి ఎకరాకు 6నుంచి 9క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా. ఆడ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. ఎకరాకు రూ.38వేల వరకు పెట్టుబడి పెట్టామని, మగ ధాన్యం కొనుగోలు చేస్తేనే కష్టాల నుంచి గట్టేక్కుతామని రైతులు అంటున్నారు. కొనుగోలు చేయని ప్రభుత్వ రంగసంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మగ ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. గ్రేడ్ ఏ రకం కింద 1010ధాన్యం, కామన్ రకం కింద మరి కొన్ని రకాల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కళ్లాల వద్ద రాశులు పోసి వేచి చూస్తున్నారు. ధాన్యం మిల్లర్ల పాలు.. మగ ధాన్యం మిల్లర్ల పాలవుతోంది. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో వివాహ శుభకార్యాలు ఉండడంతో ఖర్చుల కోసం రైతులు గత్యంతరం లేక మిల్లర్లకే విక్రయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ఉండగా మిల్లర్లు రూ.1200లోపే చెల్లిస్తున్నారు. తరుగు, తేమ పేరుతో మరింత కోత విధిస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకొని మగ ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలి.. మగ ధాన్యాన్ని ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయాలి. గింజ పొట్టిగా ఉంటుందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎలా..? రైతులు సెంటర్లకు ధాన్యం తరలిస్తే వెళ్లగొడుతున్నరు. మిల్లర్లు రూ.1200కే అడుగుతున్నరు. కనీసం కామన్ రకం కిందనైన కొనుగోలు చేయాలి. ఎక్కువ మంది రైతులు మగ వడ్లనే పండించారు. ఎవ్వరూ కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నరు. – అంబాల రంగయ్య, రైతు ఐక్యవేదిక నాయకులు ఆదేశాలు రాలేదు.. మగ వడ్లను కొనుగోలు చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకే గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. మా పరిధిలో 14సెంటర్లను ప్రారంభించాం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మాత్రమే మగ వడ్లను కొనుగోలు చేశారు. రైతులు మగ వడ్లను సెంటర్లకు తరలించ వద్దు. – ప్రకాశ్‌రెడ్డి, పీఏసీఎస్, సీఈవో -
మరో సర్వేకు సన్నద్ధం!
సాక్షి, దోమ: రైతుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారిని అభివృద్ధిపథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సర్వేకు శ్రీకారం చుట్టబోతోంది. దీనిద్వారా రైతులకు సంబంధించి పూర్తి సమాచారం పక్కాగా సేకరించనుంది. సర్వేలో పంటల సాగు, ఇతర వివరాలను పొందుపర్చనున్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం త్వరలో క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిపై సర్వే చేసేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఈ రైతు సర్వేలో పాలుపంచుకోనున్నారు. అతి త్వరలో సర్వే ప్రారంభం కానుంది. రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేసి పంటల దిగుబడులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పంట కాలనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా ప్రతి రైతు నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల నుంచి అన్నదాతల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. 39 ఆంశాలపై ఆరా.. రైతుల సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు 39కి పైగా అంశాలు రూపొందించి ఫార్మాట్ ప్రకారం పూర్తి వివరాలను సేకరిస్తారు. ఇందులో భాగంగా రైతు వివరాలు, వారికి ఎంత భూమి ఉంది.. ఏఏ పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వర్షాధారమా.. ఆయాకట్టు ఉందా.. లేదా బోరుబావుల కింద సాగు చేస్తున్నారా..? తదితర అంశాలను సేకరించనున్నారు. రైతు సాగుచేసిన పంటల దిగుబడి ఎలా ఉంది.. ఆశించిన స్థాయిలో వస్తుందా లేదా అనే సమాచారం సేకరించి ఫార్మాట్లో పొందుపరుచనున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోందా.. మార్కెటింగ్ సౌకర్యం ఉందా.. ఆయా పంటలను పండిస్తే ఎంతమేర గిట్టుబాటు అవుతోంది.. అనే వివరాలను అధికారులు సేకరించనున్నారు. భూసారం ఎలా ఉంది.. ఏఏ ఎరువులను ఏఏ పంటలకు ఉపయోగిస్తున్నారనే వివరాలను పొందుపర్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పంట కాలనీల ఏర్పాటు రైతులు పండించిన పంటలను స్థానికంగా విక్రయించి మంచి లాభాలను పొందడమే పంట కాలనీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. సర్వే అనంతరం ఏఏ పంటల సాగు ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది.. ఏఏ సీజన్లో పంటలకు మంచి డిమాండ్ ఉంటుందనే అనే విషయాలను సేకరించనున్నారు. నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని వర్షాధామైతే మొట్ట పంటలు, బోరుబావులు, కాల్వల ద్వారా అయితే ఇతర కూరగాయ పంటలను సాగు చేస్తున్నారనే అంశాలు తీసుకుంటారు. మండలం, గ్రామం లేదా నియోజవర్గం యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల వారీగా సీజన్‌ను బట్టి ఏ పంటలను సాగు చేస్తారని సమాచారాన్ని అధికారులు పూర్తిస్థాయిలో సేకరించనున్నారు. ఆయా ప్రాంత రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇలా రైతులందరు కలిసి ఒకే పంటను సాగు చేసే విధానాన్ని పంట కాలనీ అని వ్యవహరిస్తారు. తద్వారా రైతులకు ఆయా పంటలకు మార్కెట్ సౌకర్యం లభించడంతో గిట్టుబాటు ధర లభించనుంది. గిట్టుబాటు ధరలే లక్ష్యం పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి సమభావన సంఘాల ద్వారా ప్రజలకు విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనిద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధరను కల్పించడం పంట కాలనీల ఉద్దేశం. వ్యవసాయ ఉద్యానవన, మార్కెటింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమ శాఖల సమన్వయంతో పంట కాలనీల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం రైతులకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులు చెప్పారు. పూర్తిస్థాయిలో ఇంకా ఆదేశాలు రాలేవు. 39 ప్రశ్నల కాలం గల ఫారం ఉండనుంది. ఫారాలు ఇంకా రాలేదు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో రైతుల సమగ్ర సర్వే నిర్వహిస్తాం. – శ్వేత, వ్యవసాయాధికారి, దోమ -
రోడ్డెక్కిన రైతన్నలు
ఆర్మూర్ / పెర్కిట్ : రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. అయితే రైతుల ధర్నా కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను సోమవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే పోలీసులు అరెస్టులు చేశారు. సమీపంలోని ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనై రాస్తారోకోలు చేశారు. కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో వ్యవహరించిన తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అనుసరించకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా వ్యహరించాలని ఆదేశాలు జారీ చేయడంతో దీక్ష శాంతి యుతంగా కొనసాగింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపైకి ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్ సైకిళ్లపై వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పం టకు క్వింటాలుకు రూ. 3,500, పసుపునకు క్విం టాలుకు రూ. 15 వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నా రు. డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు జాతీయ రహదారులపైనే ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై వెళ్లే వాహనాలను పోలీ సులు వన్‌వే చేసి దారి మళ్లించారు. ఒక దశలో రైతులు ఆగ్రహానికిలోనై చౌరస్తాలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణికులకు అసౌ కర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రైతులు రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోతేనే తమ నిరసన తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంటూ ర్యాలీగా మామిడిపల్లి శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారి కూడలికి వచ్చారు. అక్కడ నాలుగు లేన్ల జాతీయ రహదారిపై ఇరువైపుల బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గం గుం డా వచ్చే వాహనాలను మళ్లించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు. కాగా ఈనెల 7న ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్ ఏడీ రియాజ్‌లకు తమ డిమాండ్లను తెలియజేస్తూ విన తి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన కోసం ఐదు రోజులు వేచి చూసిన రైతులు, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని సాయంత్రం వరకు ధర్నా నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆర్మూర్ డివిజన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్ మండల కేంద్రాలలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లిలో, ఆర్మూ ర్ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున్న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనం తరం ధర్నాను విరమించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో బస్సుప్రయాణికులు తమకు దారి ఇవ్వాల్సిందిగా వాగ్వాదానికి దిగినా పట్టించుకోని రైతులు ఆర్మూర్ వైపు వస్తున్న అంబులెన్స్‌కు మాత్రం దారి ఇచ్చి వెళ్లనిచ్చారు. సంయమనం పాటించిన పోలీసులు.. 2008లో పోలీస్ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాయుతంగా మా రింది. మంగళవారం ఆర్మూర్‌లో జరిగిన రైతు ఉద్యమంలో అడుగడుగునా పోలీసుల తీరు ప్ర శంసనీయంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించా రు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రెయిన్ ఐపీఎస్ గౌస్ ఆలం, ఆర్మూ ర్ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్ ఎస్సైలు, సివి ల్ ఎస్సైలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌కు చెందిన ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా తరలి వచ్చిన రైతులను ఇ బ్బంది పెట్టకుండా పోలీసులు సంయమనాన్ని పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కో ల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగి స్తూ శాంతి యుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసు బలగాలు లాఠీలను గాని ఆ యుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌లా వ్యవహరించడం పలువురి ప్రశంసల కు కారణమైంది. మరో వైపు 63వ నెంబర్ జాతీ య రహదారి, 44వ నెంబర్ జాతీయ రహదారులపై రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడానికి వ్యవహరించిన తీరును పలువురు అభినందించారు. -
ఉద్యమ బాట!
ఎర్రజొన్న పంట మరో 15 రోజుల్లో కోతకు రానుండడంతో వ్యాపారులు రైతులను మోసగించేందుకు పావులు కదుపుతున్నారు. బైబ్యాక్ ధర ఒప్పందాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్నారు. పంట అధికంగా సాగవడంతో బైబ్యాక్ ధర చెల్లించలేమని, తక్కువ ధర అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ధర తగ్గితే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోతకు సమయం ఆసన్నమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలాగే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ ఉద్యమ బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంత రైతాంగం వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ఎర్రజొన్న పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రతియేటా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి పునరావృతం అవుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లాను సీడ్‌బౌల్ ఆఫ్ తెలంగాణగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా పాలకుల అడుగులు అందుకు అనుగుణంగా పడకపోవడంతో మరోమారు జిల్లాలో ఎర్రజొన్నలు పండించే రైతాంగం వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా రూ. వంద కోట్లు కేటాయించి ఎర్రజొన్నలను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఎర్రజొన్నలను విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలోని వ్యాపారులకు, రైతులకు అమ్మడంలో విఫలమై నష్టాల పాలైంది. దీంతో ఈ ఏడాది 15 రోజుల్లో పంట కోతకు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదు. దీంతో ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులు మరోమారు ఉద్యమం చేసైనా సరే తమ పంటకు గిట్టుబాటు ధర రాబట్టుకోవాలని ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. గత వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం కారణంగా రబీలో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. దీంతో జిల్లాలోని రైతులు వరి స్థానంలో ఆరుతడి పంట అయిన ఎర్రజొన్న పంటను పండించడానికి ఆసక్తి చూపించారు. ఈ పరిస్థితిని ఎర్రజొన్న విత్తన వ్యాపారులు తమకు అనువుగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఎర్రజొన్న విత్తనాలను రైతులు పండిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని అంకాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 40కి పైగా సీడ్ కంపెనీలు వెలిశాయి. ఈ సీడ్ వ్యాపారులు ప్రతియేటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతులతో ముందస్తుగా కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎర్రజొన్నల ఫౌండేషన్ సీడ్‌ను సరఫరా చేస్తుంటారు. పంట ఫిబ్రవరి మాసంలో చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్ ఇచ్చిన వ్యాపారే తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తాడు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను శుద్ధిచేసి, ప్యాకింగ్ చేసి ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో అధిక ధరకు విత్తనాలు అమ్ముతుంటారు. రైతుల ఉద్యమాల ఫలితంగా బైబాక్ ఒప్పందాలు తగ్గిపోయి రైతులు నేరుగానే విత్తనం కొనుగోలు చేసి పంటను పండించి సీడ్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ ఎర్రజొన్న విత్తనాలతో ఉత్తర భారత దేశంలో పశువుల దాణా కోసం ఉపయోగించే గడ్డిని పెంచుతుంటారు. అయితే భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములు మాత్రమే ఈ ఎర్రజొన్న విత్తనాలు పండించడానికి అనువుగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండించగా నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మిగిలిన 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తుంటారు. అందులో కేవలం నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 45 వేల ఎకరాలకు పైగా ఎర్రజొన్న పంటను రైతులు పండిస్తున్నారు. దీంతో ప్రతిఏటా సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి ఉత్తర భారతదేశంలో అధిక ధరకు అమ్ముకొని లాభపడడం జరుగుతోంది. బైబ్యాక్ ఒప్పందాన్ని విస్మరించిన వ్యాపారస్తులు ఈ ఏడాది ఎర్రజొన్నల వివాదం తలెత్తొద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ సీడ్ వ్యాపారులు, రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతుకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చే సమయంలోనే బైబాక్ ఒప్పందానికి రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో కొందరు రైతులు క్వింటాలు ఎర్రజొన్నలను 1,500 రూపాయలు చెల్లించి తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. మరికొందరు ప్రతిసారిలాగే ఈ సారి కూడా రైతులను మోసం చేసి లాభపడవచ్చనే ఆలోచనతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోలేదు. మోసాలకు తెరలేపిన వ్యాపారులు సీడ్ వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంట విత్తడం ద్వారా దిగుబడి గణనీయంగా పెరిగిపోయిందని, రైతులు ఆశించిన ధర రాదంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. బైబ్యాక్ ఒప్పందం కంటే తక్కువ ధర చెల్లిస్తామంటూ మంతనాలు చేస్తున్నారు. తాము పండించిన పంటను నిల్వ చేసుకొని అమ్ముకోవడానికి ఇష్టపడని రైతాంగం సీడ్ వ్యాపారులు సూచించిన అతి తక్కువ ధరకే పంటను అమ్ముకొనే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎత్తుగడలో సీడ్ వ్యాపారులు విజయం సాధిస్తే రైతులు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఎదురు కానుంది. గతేడాది.. ఆర్మూర్‌లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గతేడాది రైతులు చేపట్టిన ఆమరణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామంటూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ప్రకటన చేసిన 24 గంటల్లోనే ఎర్రజొన్నల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 33 మండలాల పరిధిలో 27 వేల 506 మంది రైతులు 51 వేల 234 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్న పంట నుంచి వచ్చిన 87 వేల 99 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను సైతం జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 27 మండలాల పరిధిలో 27 వేల 103 మంది రైతులు 50 వేల 427 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్నపై వచ్చిన దిగుబడి 85 వేల 726 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలతో పాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో సాగయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2018 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ కొనుగోలు ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎర్రజొన్నల కొనుగోలుకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధిస్తేనే సాధ్యమవుతుందని పలువురు రైతు నాయకులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్న విత్తనాలను కొనుగోలు చేసి, విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలో అమ్మకాలు సాగిస్తే రైతులు పంటకు ఆశించిన మద్దతు ధర పొందమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం లాభపడే పరిస్థితులు ఉంటాయి. లేనిపక్షంలో రైతులు మరోసారి సీడ్ వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితి నెలకొంది. -
ఇది ప్రభుత్వ దోపిడీయే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రకృతి సహకరించక, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు వ్యాపారుల మాయాజాలం మరింత వేదన కలిగిస్తోంది. సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, వ్యాపారులు నానా సాకులు చెబుతూ అతితక్కువ ధర చెల్లిస్తుండటంతో కడుపు మండిన రైతన్న ఆందోళనకు దిగుతున్నాడు. అసలు ప్రభుత్వమే తమ వద్ద దోచుకుంటోందంటూ మండిప డుతున్నాడు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులు.. తమ ఆవేదనను, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా నిరసన తెలిపారు. ‘పత్తి ధరలపై బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన ధర ఎంత? ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఎంత? క్షేత్రస్థాయిలో ఈ రోజు తమ పత్తికి పలికిన ధర ఎంత? తాము నష్టపోయిన మొత్తం ఎంత?’ అనే వివరాలతోపాటు ఈ నష్టాన్ని ప్రభుత్వం దోచుకున్న ట్లేనంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో వినూత్నంగా ప్రదర్శించా రు. ఆరుగాలం శ్రమించి ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్కై అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఇష్టారాజ్యం వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) అంచనా ప్రకారం క్వింటాల్ దిగుబడికి ఖర్చు ఎంత అవుతుందో దానికి 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలి. పత్తికి రూ.6,564 గిట్టుబాట ధర వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని స్వామినాథన్ కమిషన్ కూడా పేర్కొంది. ఈ రెండు అంశాలను గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించిం ది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై మూడున్న రేళ్లు దాటిపోతున్నా ఇవేవీ అమల్లోకి రాలేదు. ఇక ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ.4,320 మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే ఇందులోనూ పత్తి నాణ్యత, తేమ శాతంపై సీసీఐ అడ్డగోలు నిబంధనలు విధించింది. రైతులు తెస్తున్న పత్తి ఆ నిబంధనల ప్రకారం లేదంటూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నారు. కేవలం రూ.1,500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. పూర్తి నాణ్యౖ మెన, నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి కూడా గరిష్టంగా రూ.4,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు, వాస్తవాలపై ఆందోళన రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 20న ‘ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. దీనిపై ప్రధాని మోదీని లెక్కలు అడుగుదాం’ అనే నినాదంతో ఢిల్లీలో కిసాన్ ముక్తియాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన మార్కెట్లలో ముక్తి వికాస్, మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలతోపాటు సుమారు 40 ప్రజా సంఘాల నాయకులు పత్తి రైతుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట మార్కెట్లో పత్తికి మద్దతు ధర అమలు, కొనుగోళ్ల తీరుపై పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల దోపిడీపై రైతులతో కలసి నిరసన తెలుపుతు న్నారు. ‘ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటోంది’ అనే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయా రైతుల పేర్లు, గ్రామం, తెచ్చిన పత్తి, చెల్లించిన ధర, స్వామినాథన్ నివేదిక ఆధారం గా అందాల్సిన ధర, మద్దతు ధర, ప్రభుత్వం దోచుకున్నది ఎంత..’’ అనే వివరాలు రాస్తున్నారు. మొత్తంగా ‘కిసాన్ ముక్తియాత్ర’ కార్యక్రమానికి ఐదు వేల మంది రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నేతలు వెళ్లనున్నారు. ఈ చిత్రంలో ఆవేదనతో కనిపిస్తున్న మహిళా రైతు ఉనుగూరి కమల. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. ఆమె ఖరీఫ్‌లో ఆరెకరాల్లో పత్తి సాగు చేసింది. గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. 65 మంది కూలీలతో పత్తి ఏరితే 11 బస్తాలు (7 క్వింటాళ్లు) వచ్చింది. దానిని బుధవారం జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చింది. వ్యాపారులు ఆ పత్తిని పరిశీలించి.. కాయ, తేమ ఉందని, గుడ్డి పత్తి అంటూ క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున మాత్రమే చెల్లించారు. అంత తక్కువ ధర చెల్లించడంతో కమల కన్నీరు పెట్టుకుంది. పత్తి ఏరిన కూలీల కోసమే రూ.15 వేలు ఖర్చయింది. దానిని అమ్మితే రూ.10,500 మాత్రమే చేతికి వచ్చాయంటూ ఆవేదనకు గురైంది. అటు మూడెకరాల్లో వరి సాగు చేస్తే దోమపోటు సోకి దెబ్బతిన్నదని విలపించింది. సాగును నమ్ముకుంటే అప్పులు, కన్నీళ్లే మిగిలాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రైతులకు పంట నష్టం చెల్లించాలి ‘‘ప్రభుత్వం హామీ ఇచ్చిన ధర కాకుండా ఎంఎస్పీని ప్రకటించింది. అది కూడా అందని పరిస్థితి ఉంది. అకాల వర్షాలతో పత్తి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ధరను వెంటనే అమల్లోకి తేవాలి. బుధవారం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఒక్క రైతు వద్ద కూడా కొనుగోలు చేయకుండా ట్రేడర్స్‌కు వదిలేశారు. సీసీఐ కంటే ట్రేడర్సే ఎక్కువ ధర చెల్లిస్తున్నారంటూ బుకాయిస్తున్నారు. నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి..’’ – విస్స కిరణ్‌కుమార్,రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు -
క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధర (బేసిక్ మార్కెట్ వాల్యూ)ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు 125 గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్థలాల క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలనే అంశంపై ఏకీభవించిన అఖిలపక్ష ప్రతినిధులు.. ఆపైబడిన స్థలాల క్రమబద్ధీకరణకు శ్లాబ్‌ల వారీగా నిర్దిష్ట ధరలను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతికి ఊరట! పేదలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం.. 126-250 గజాల వరకు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల విషయంలోనూ కొంత ఉదారత ప్రదర్శిస్తోంది. అల్పాదాయవర్గాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణకు నామమాత్రపు రుసుమును వసూలు చేయాలన్న ప్రతినిధుల అభిప్రాయానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని, ఆక్రమితులు కూడా క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. అలాగే రెగ్యులరైజ్‌కు కేటగిరీల వారీగా ధరలను నిర్దేశించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 126-250 గజాలకు ఒక ధర, 256-500 చదరపు గజాల వరకు ఇంకో ధర, 500 గజాల పైబడిన స్థలాలకు భారీ మొత్తంలో వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, 500 గజాల వరకు క్రమబద్ధీకరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టాలని, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలావుండగా, స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధరనుప్రామాణికంగా తీసుకోవాలని మెజారిటీ ప్రతినిధులు పట్టుబట్టగా, ప్రస్తుత ధరను నిర్దేశించాలని మరికొన్ని పార్టీలు వాదించాయి. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా, కట్టడాలు మినహా ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించకూడదని సర్కారు భావిస్తోంది. కాగా, ప్రభుత్వం క్రమబద్ధీకరణపై విధానపర నిర్ణయం తీసుకుంటే జిల్లాలో 1.01 లక్షల నిర్మాణాలకు ప్రయోజనం చేకూరనుంది.