చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో ఎగుమతికి సిద్ధమవుతున్న టమాటా
సాక్షి, అమరావతి: మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టమాటా మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం కిలో రూ.2–4 మధ్య పలికిన ధర నేడు రూ.7–14ల మధ్య పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వచ్చే కొద్దిరోజుల్లో లాక్‌డౌన్ సడలింపులతో ఎగుమతులు పుంజుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. టమాటా పంట రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,090 హెక్టార్లు, అనంతపురంలో 19,340 హెక్టార్లు, కర్నూలులో 3,203 హెక్టార్లలో సాగవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 22.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తుంది. ఇలా మార్కెట్‌కు వచ్చే టమాటాలో మూడొంతులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకే పరిమితమైన ఎగుమతులు మంగళవారం పది రాష్ట్రాలకు పెరిగింది. మరో నాలుగు రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి.
వేలం పాటల్లో మార్కెటింగ్ శాఖ..
నిజానికి.. కరోనావల్ల ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎగుమతుల్లేక, మార్కెట్‌లో ధరలేక కిలో టమాటా రూ.2–4కు మించి ధర పలకలేదు. ఈ దశలో ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద ధర తక్కువగా ఉన్న మార్కెట్‌లలో వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొంది. ఇలా కిలో రూ.5–7 చొప్పున రూ.11లక్షలు వెచ్చించి 52 మంది రైతుల నుంచి సుమారు 130.39 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం రైతుబజార్ల ద్వారా విక్రయాలు జరిపింది. మరోవైపు.. ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా 410 మంది రైతుల నుంచి రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా కిలో రూ.4కు మించి పలకని టమాటా ధర ప్రస్తుతం గరిష్టంగా రూ.14లు పలుకుతోంది. జాతీయ స్థాయిలో టమాటా మార్కెట్‌గా పేరొందిన మదనపల్లెతో పాటు పలమనేరు, మలకల చెరువు మార్కెట్ యార్డుల్లో టమాటా రైతుకు నేడు మంచి రేటు వస్తోంది.
కనిష్ట, గరిష్ట ధరలిలా..
► మదనపల్లె మార్కెట్ యార్డులో మంగళవారం మొదటి రకం టమాటా కిలో కనిష్టం రూ.11, గరిష్టం రూ.14.. రెండో రకం కనిష్టం రూ.7, గరిష్టం రూ.10 పలికింది.
► అలాగే, పలమనేరు మార్కెట్ యార్డులో రెండో రకం కనిష్టం రూ.9, గరిష్టం రూ.12 ధర పలికింది.
► మలకలచెరువు మార్కెట్ యార్డులో కిలో కనిష్టంగా రూ.7, గరిష్టంగా 10 పలికింది. ఈ మూడు మార్కెట్ యార్డులకు సగటున రోజుకు 2వేల టన్నుల చొప్పున టమాటా వస్తోంది. రైతుల వద్ద మరో 10 లక్షల టన్నుల టమాటా ఉన్నట్లు అంచనా.
► ఇదిలా ఉంటే.. టమాటా ధరలు ఈనెలాఖరులో భారీగా పెరిగే సూచనలు ఉన్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. లాక్‌డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాలకు ఎగుమతులు మొదలైతే వ్యాపారుల మధ్య పోటీతో ధరలు ఇంకా పెరుగుతాయి.
ప్రభుత్వం జోక్యంవల్లే..
మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంవల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఒకసారి పతనమైతే మళ్లీ పెరిగిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈసారి కిలో రూ.2–4ల మధ్య ప్రారంభమైన ధర నేడు కిలో రూ.14లు పలుకుతోంది. మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
– పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ
ఇది నిజంగా శుభపరిణామం
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మదనపల్లె మార్కెట్‌లో టమాటాకు మంచి ధర పలుకుతోంది. 10 కిలోల టమాటా 1వ రకం గరిష్టంగా రూ.140 పలకడం నిజంగా శుభపరిణామం. ప్రస్తుతం సాగు రకాల్లో 1వ రకం టమాటా 60 శాతం కంటే ఎక్కువగా సాగవుతోంది.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్
Comments
Please login to add a commentAdd a comment