కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు | CM YS Jagan high-level review on the problems of tobacco farmers | Sakshi
Sakshi News home page

కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు

Published Fri, Jun 19 2020 2:34 AM | Last Updated on Fri, Jun 19 2020 8:22 AM

CM YS Jagan high-level review on the problems of tobacco farmers - Sakshi

అన్ని పంటల్లాగే పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. మార్కెట్‌కు వచ్చిన అన్ని రకాల పొగాకుకు కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి. ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలి. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలి. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలి.

పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్‌ చేసే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. వ్యాపారాలు చేయని వారి లైసెన్స్‌లను తొలగించాలి. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్‌లు ఎందుకు? ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుంది.  

సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు మేలు జరిగేలా కనీస ధర ప్రకటించి, ఆపై ధరలకే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  మార్కెట్‌లో పొగాకు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు రైతుల సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పటికప్పుడే స్పందిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

లైసెన్స్‌ తీసుకున్నారంటే కొనుగోలు చేయాల్సిందే
► ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. అరటి, మొక్క జొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కరోనా సమయంలో కూడా భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశాం.
► పొగాకును కూడా అలాగే కొనాలి. పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. లైసెన్స్‌లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి. 
► ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కెట్లో జోక్యం కోసం రెండు మూడు రోజుల్లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్‌ తీసుకుంటుంది. ఒక ఐఏఎస్‌ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుంది. 
► బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుంది. ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుంది. 
► పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలి. అలాగే లైసెన్స్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ  వేలం కేంద్రాల వద్ద ప్రతిరోజూ కొనుగోలు చేయాలి. వేలం జరిగే అన్ని రోజులూ పాల్గొనాలి. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పొగాకును వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. 
► రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది మా అజెండా.
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వ్యాపారులు రింగ్‌ కాకుండా చూడాలి
► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది. మార్కెట్లో పోటీతత్వం పెంచింది. రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది. దీన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి.
► ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉంది.  లక్ష్యాల మేరకే పంట సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారు.
► 920 మందికి లైసెన్స్‌లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదు. వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు వేలం కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని రైతులు చెబుతున్నారు. 
► వ్యాపారులు ఒక రింగులా ఏర్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాల్సిందే. మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్‌ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలి.
► రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది.
► రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే మీరు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదు. తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు. కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుంది. 
► ప్రాసెస్‌ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతో కాలం సరుకును నిల్వ చేసుకోలేడు. చివరకు వ్యాపారులు రింగ్‌ అవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  

మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
► పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇండెంట్‌ ఇచ్చి, తమ చేత పంట పండించి.. చివరకు వేలం కేంద్రం వద్దకు వ్యాపారులు రావడం లేదని వాపోయారు. కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు ధరలు తగ్గిపోయాయన్నారు. 
► గడువు ముగిసినా.. వారం.. పది రోజులు అంటూ కొనుగోలు చేయడం లేదన్నారు. వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.1.4 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.
► కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు, ఎగుమతుల రూపంలో మరో రూ.6 వేల కోట్ల ఆదాయం పొగాకు ద్వారా వస్తోంది. రైతులకు మాత్రం అప్పులు తప్పడం లేదన్నారు. ఒక ఏడాది పెట్టబడులు వస్తే.. వరుసగా ఆరేళ్లు నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
► పొగాకు కొనుగోలు కోసం రిజిస్టర్‌ చేసిన కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం లేదని.. మీడియం, లోగ్రేడ్‌ పొగాకు రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
► ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్‌దారులంతా వేలంలో పాల్గొనాల్సిందే 
లైసెన్స్‌ తీసుకొని పంట సాగు చేసిన రైతు నష్టపోకుండా ఉండే విధంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేçస్తున్నాం. కొంతమంది లైసెన్స్‌దారులు కంపెనీలతో కుమ్మక్కయి రైతులు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా చేయడం ఇకపై సాధ్యం కాదు. ఇక నుంచి ప్రతీ లైసెన్స్‌దారుడు విధిగా వేలంలో పాల్గొనే విధంగా నిబంధన తీసుకువస్తాం. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌గా స్థానిక రైతులనే నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా ఇంచార్జిమంత్రి గౌరవ అధ్యక్షులుగా, మండల కమిటీలకు స్థానిక ఎమ్మల్యేలు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. ఈ కమిటీలో కౌలు రైతు, మహిళా రైతు విధిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. 
    – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement