ఉద్యమ బాట! | Farmers Protest For Minimum Prices In Nizamabad | Sakshi
Sakshi News home page

ఉద్యమ బాట!

Published Fri, Feb 1 2019 8:34 AM | Last Updated on Fri, Feb 1 2019 8:34 AM

Farmers Protest For Minimum Prices In Nizamabad - Sakshi

ఎర్రజొన్న పంట మరో 15 రోజుల్లో కోతకు రానుండడంతో వ్యాపారులు రైతులను మోసగించేందుకు పావులు కదుపుతున్నారు. బైబ్యాక్‌ ధర ఒప్పందాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్నారు. పంట అధికంగా సాగవడంతో బైబ్యాక్‌ ధర చెల్లించలేమని, తక్కువ ధర అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ధర తగ్గితే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోతకు సమయం ఆసన్నమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలాగే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ ఉద్యమ బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.  

ఆర్మూర్‌: ఆర్మూర్‌ ప్రాంత రైతాంగం వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ఎర్రజొన్న పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రతియేటా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి పునరావృతం అవుతూనే ఉంది. నిజామాబాద్‌ జిల్లాను సీడ్‌బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా పాలకుల అడుగులు అందుకు అనుగుణంగా పడకపోవడంతో మరోమారు జిల్లాలో ఎర్రజొన్నలు పండించే రైతాంగం వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా రూ. వంద కోట్లు కేటాయించి ఎర్రజొన్నలను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఎర్రజొన్నలను విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలోని వ్యాపారులకు, రైతులకు అమ్మడంలో విఫలమై నష్టాల పాలైంది.

దీంతో ఈ ఏడాది 15 రోజుల్లో పంట కోతకు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదు. దీంతో ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులు మరోమారు ఉద్యమం చేసైనా సరే తమ పంటకు గిట్టుబాటు ధర రాబట్టుకోవాలని ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. గత వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం కారణంగా రబీలో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. దీంతో జిల్లాలోని రైతులు వరి స్థానంలో ఆరుతడి పంట అయిన ఎర్రజొన్న పంటను పండించడానికి ఆసక్తి చూపించారు. ఈ పరిస్థితిని ఎర్రజొన్న విత్తన వ్యాపారులు తమకు అనువుగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఎర్రజొన్న విత్తనాలను రైతులు పండిస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలోని అంకాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 40కి పైగా సీడ్‌ కంపెనీలు వెలిశాయి.

ఈ సీడ్‌ వ్యాపారులు ప్రతియేటా అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో రైతులతో ముందస్తుగా కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎర్రజొన్నల ఫౌండేషన్‌ సీడ్‌ను సరఫరా చేస్తుంటారు. పంట ఫిబ్రవరి మాసంలో చేతికి రాగానే ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చిన వ్యాపారే తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తాడు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను శుద్ధిచేసి, ప్యాకింగ్‌ చేసి ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్‌ ఆఫ్రికా తదితర దేశాల్లో అధిక ధరకు విత్తనాలు అమ్ముతుంటారు. రైతుల ఉద్యమాల ఫలితంగా బైబాక్‌ ఒప్పందాలు తగ్గిపోయి రైతులు నేరుగానే విత్తనం కొనుగోలు చేసి పంటను పండించి సీడ్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ ఎర్రజొన్న విత్తనాలతో ఉత్తర భారత దేశంలో పశువుల దాణా కోసం ఉపయోగించే గడ్డిని పెంచుతుంటారు.

అయితే భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ నిజామాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ భూములు మాత్రమే ఈ ఎర్రజొన్న విత్తనాలు పండించడానికి అనువుగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండించగా నిజామాబాద్‌ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కలిపి మిగిలిన 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తుంటారు. అందులో కేవలం నిజామాబాద్‌ జిల్లాలోనే సుమారు 45 వేల ఎకరాలకు పైగా ఎర్రజొన్న పంటను రైతులు పండిస్తున్నారు. దీంతో ప్రతిఏటా సీడ్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి ఉత్తర భారతదేశంలో అధిక ధరకు అమ్ముకొని లాభపడడం జరుగుతోంది.

బైబ్యాక్‌ ఒప్పందాన్ని విస్మరించిన వ్యాపారస్తులు
ఈ ఏడాది ఎర్రజొన్నల వివాదం తలెత్తొద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ సీడ్‌ వ్యాపారులు, రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతుకు ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చే సమయంలోనే బైబాక్‌ ఒప్పందానికి రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో కొందరు రైతులు క్వింటాలు ఎర్రజొన్నలను 1,500 రూపాయలు చెల్లించి తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. మరికొందరు ప్రతిసారిలాగే ఈ సారి కూడా రైతులను మోసం చేసి లాభపడవచ్చనే ఆలోచనతో బైబ్యాక్‌ ఒప్పందాలు చేసుకోలేదు.

మోసాలకు తెరలేపిన వ్యాపారులు 
సీడ్‌ వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంట విత్తడం ద్వారా దిగుబడి గణనీయంగా పెరిగిపోయిందని, రైతులు ఆశించిన ధర రాదంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. బైబ్యాక్‌ ఒప్పందం కంటే తక్కువ ధర చెల్లిస్తామంటూ మంతనాలు చేస్తున్నారు. తాము పండించిన పంటను నిల్వ చేసుకొని అమ్ముకోవడానికి ఇష్టపడని రైతాంగం సీడ్‌ వ్యాపారులు సూచించిన అతి తక్కువ ధరకే పంటను అమ్ముకొనే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎత్తుగడలో సీడ్‌ వ్యాపారులు విజయం సాధిస్తే రైతులు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఎదురు కానుంది.

గతేడాది.. 
ఆర్మూర్‌లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గతేడాది రైతులు చేపట్టిన ఆమరణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామంటూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ప్రకటన చేసిన 24 గంటల్లోనే ఎర్రజొన్నల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 33 మండలాల పరిధిలో 27 వేల 506 మంది రైతులు 51 వేల 234 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్న పంట నుంచి వచ్చిన 87 వేల 99 మెట్రిక్‌ టన్నుల ఎర్రజొన్నలను రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను సైతం జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని 27 మండలాల పరిధిలో 27 వేల 103 మంది రైతులు 50 వేల 427 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్నపై వచ్చిన దిగుబడి 85 వేల 726 మెట్రిక్‌ టన్నుల ఎర్రజొన్నలతో పాటు జగిత్యాల్, నిర్మల్‌ జిల్లాల్లో సాగయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2018 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ కొనుగోలు ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎర్రజొన్నల కొనుగోలుకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు.
 
రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే మార్గం 
రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధిస్తేనే సాధ్యమవుతుందని పలువురు రైతు నాయకులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్న విత్తనాలను కొనుగోలు చేసి, విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలో అమ్మకాలు సాగిస్తే రైతులు పంటకు ఆశించిన మద్దతు ధర పొందమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం లాభపడే పరిస్థితులు ఉంటాయి. లేనిపక్షంలో రైతులు మరోసారి సీడ్‌ వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement