సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధర (బేసిక్ మార్కెట్ వాల్యూ)ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు 125 గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్థలాల క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలనే అంశంపై ఏకీభవించిన అఖిలపక్ష ప్రతినిధులు.. ఆపైబడిన స్థలాల క్రమబద్ధీకరణకు శ్లాబ్‌ల వారీగా నిర్దిష్ట ధరలను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
మధ్యతరగతికి ఊరట!
పేదలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం.. 126-250 గజాల వరకు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల విషయంలోనూ కొంత ఉదారత ప్రదర్శిస్తోంది. అల్పాదాయవర్గాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణకు నామమాత్రపు రుసుమును వసూలు చేయాలన్న ప్రతినిధుల అభిప్రాయానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని, ఆక్రమితులు కూడా క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. అలాగే రెగ్యులరైజ్‌కు కేటగిరీల వారీగా ధరలను నిర్దేశించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 126-250 గజాలకు ఒక ధర, 256-500 చదరపు గజాల వరకు ఇంకో ధర, 500 గజాల పైబడిన స్థలాలకు భారీ మొత్తంలో వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కాగా, 500 గజాల వరకు క్రమబద్ధీకరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టాలని, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలావుండగా, స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధరనుప్రామాణికంగా తీసుకోవాలని మెజారిటీ ప్రతినిధులు పట్టుబట్టగా, ప్రస్తుత ధరను నిర్దేశించాలని మరికొన్ని పార్టీలు వాదించాయి. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా, కట్టడాలు మినహా ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించకూడదని సర్కారు భావిస్తోంది. కాగా, ప్రభుత్వం క్రమబద్ధీకరణపై విధానపర నిర్ణయం తీసుకుంటే జిల్లాలో 1.01 లక్షల నిర్మాణాలకు ప్రయోజనం చేకూరనుంది.
క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ..
Published Wed, Dec 17 2014 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement