land regularisation
-
ఆక్రమిత ప్రభుత్వస్థలాల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఆక్రమిత ప్రభుత్వస్థలాల క్రమబద్ధీకరణకుగాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 58, 59 జీవోలకు అనుగుణంగా ఈ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో 14ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవో అమలుకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో రూ.వెయ్యి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో జీవో 59లో పేర్కొన్న విధంగా దరఖాస్తు సమయంలోనే ప్రభుత్వ విలువలో 12.5 శాతం డిపాజిట్ రూపంలో మొదటి వాయిదా కింద చెల్లించాల్సి ఉండగా, ఈసారి ఆ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వ్యక్తిగత ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారుల ఆధార్‌కార్డు, కబ్జాలో ఉన్నట్టు నిరూపించేందుకుగాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, విద్యుత్, నీటిబిల్లు రసీదులు, స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల్లో ఏదో ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది. ఆక్రమితస్థలం ఫొటోను కూడా దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు ఇదే తుది అవకాశమని కూడా ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు!
శంషాబాద్‌కు చెందిన దయానంద్‌రెడ్డికి మండల పరిధిలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వాటికి ఎల్ఆర్ఎస్ చేయించేందుకు సమీపంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో సంప్రదించగా ఒక్కో దరఖాస్తుకు రూ. 2 వేలు అవుతుందని చెప్పడంతో ఆ మేరకు రూ. 8 వేలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గంట తర్వాత నాలుగు రిసిప్ట్‌లను దయానంద్‌రెడ్డి చేతిలో పెట్టాడు. తీరా రిసిప్ట్‌లను పరిశీలిస్తే నాలుగింటికి కలిపి రూ. 4,180 మాత్రమే దరఖాస్తు ఫీజు అయినట్లుంది. మిగతా మొత్తంపై ఆరా తీయగా దరఖాస్తు చేసినందుకు సర్వీసు చార్జీ తీసుకున్నట్లు కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో నోట మాటరాలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే రూ. వెయ్యి వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడాన్ని కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ దరఖాస్తుదారుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల ప్రకారం ఒక ప్లాట్ కోసం చేసుకొనే దరఖాస్తుపై రూ.వెయ్యితోపాటు అదనంగా రూ. 45 జీఎస్టీ రూపంలో చెల్లించాలి. అదేవిధంగా లేఅవుట్ దరఖాస్తుకు రూ. 10 వేలతోపాటు జీఎస్టీ చెల్లించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్లో లేఅవుట్ దరఖాస్తుల కంటే వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. సర్కారు ఆదాయాన్ని తలదన్నేలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ విధానం, దరఖాస్తు తీరుపై సరైన ఆవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనే ప్రొత్సహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియకు తెరలేచింది. ఎక్కడికక్కడ దరఖాస్తు కేంద్రాలు తెరవడంతో అర్జీలు పెట్టుకొనే వారంతా ఇలాంటి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ కేంద్రాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు మాత్రం చేతిచమురు వదిలిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై డబుల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ. 1,545 నుంచి రూ. 2,045 వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కింద వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయ్యే ఫీజుల కంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసే మధ్యవర్తులే అధికంగా సంపాదిస్తుండడం గమనార్హం. అందరికీ అందుబాటులో... ఎల్ఆర్ఎస్ పథకం దరఖాస్తు విధానం అత్యంత సులభంగా ఉంది. కానీ ఈ దరఖాస్తు చేసుకొనే తీరుపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ట్యాబ్‌లలో దేని ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారం నింపాక దరఖాస్తుదారు తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదటి పేజీని, లేఅవుట్ నమూనాను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లను ఎంట్రీ చేసి నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ఖాతా లేదా ఏటీఎం కార్డు, టీవ్యాలెట్ యాప్‌ల ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రసీదు వస్తుంది. -
పట్టణ ధనికులకు 100 గజాలు ఉచితం!
ఆక్రమణల క్రమబద్ధీకరణపై మంత్రుల కమిటీ నిర్ణయం 100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరణకు యోచన నిర్ధారించిన ధరకే ఇవ్వాలని గత కమిటీల సూచన దానిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఉచితంవైపే మొగ్గు సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో అనధికారికంగా ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. పట్టణాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీతో పాటు సీసీఎల్ఎ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. మిగతా వారందరికీ నిర్ధారించిన ధరకు క్రమబద్ధీకరించాలని సూచించాయి. అయితే ఈ సిఫార్సు ప్రభుత్వ పెద్దకు ఏ మాత్రం నచ్చలేదు. ధనికులకు కూడా 100 చదరపు గజాల వరకు ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం అధికారుల కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మంత్రులతో ఉప కమిటీ వేశారు. ఈ మంత్రుల కమిటీ పేద, ధనిక తేడా లేకుండా పట్టణాల్లో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలంటూ సిఫార్సులు చేసింది. గత ప్రభుత్వాలు బీపీఎల్ కుంటుంబాలకు మాత్రమే గ్రామాల్లో 100 చదరపు గజాలు, పట్టణాల్లో 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉండే కుటుంబాలకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం చూస్తుంటే అసలు క్రమబద్ధీకరణ ధనికుల కోసమే అన్నట్లుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి. గతంలో క్రమబద్ధీకరణకు కోర్టు బ్రేక్.. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి ప్రభుత్వం పట్టణాల్లో ఆక్రమణల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించింది. అయితే 2013లో న్యాయస్థానం ఆదేశాలతో ఆక్రమణల క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. అప్పట్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు 2013, అక్టోబర్ నెలాఖరు వరకు 33,090 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 1,463 దరఖాస్తుదారులకు 80 చదరపు గజాల వరకు పేదలకు ఉచితంగాను, 1,758 దరఖాస్తు దారులకు 250 చదరపు గజాల వరకు నిర్ధారించిన ధరకు మొత్తం 4,59,861.61 చదరపు గజాలను క్రమబద్ధీకరించారు. న్యాయస్ధానం ఆదేశంతో క్రమబద్ధీకరణ నిలిచిపోవడంతో 2013, అక్టోబర్ నెలాఖరు నాటికి 1,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అప్పుడే నిబంధనలకు సరిపడా దరఖాస్తులు లేని కారణంగా ఏకంగా 27,736 దరఖాస్తులను జిల్లాల్లో తిరస్కరించారు. -
కబ్జా భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆక్రమణలకు గురైన భూముల క్రమబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా 500 గజాల వరకు ఆక్రమిత భూములను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు సబ్ కమిటీ తెలిపింది. 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31వరకు ఆక్రమణలో ఉన్న భూములకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ మేరకు వచ్చే ఏపీ కేబినెట్ సమావేశానికి సబ్ కమిటీ క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలు అందజేయనుంది. -
ఇంటితో పాటు ఖాళీ స్థలముంటే ఓకే..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సొమ్ము చెల్లింపు కేటగిరి (జీఓ 59)లో ఇంటితోపాటు ఓపెన్ ప్లాటు ఉన్నట్లయితే ఆ దరఖాస్తులను కూడా క్రమబద్ధీకరించడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం తాజాగా నివేదిక సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే అనర్హతలో ఉన్న 50 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అదనపు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిని తరలించటం కష్టంగా ఉంటుందన్న అభిప్రాయంతో అధికార యంత్రాంగం ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఈ కేటగిరి కింద 942 దరఖాస్తులు రాగా, 357 దరఖాస్తులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి. రంగారెడ్డి జిల్లాలో జీవో 59 కింద 11,744 దరఖాస్తులు రాగా, 2,758 దరఖాస్తులు అర్హత సాధించినట్లు రెవెన్యూ యంత్రాంగం నిర్ధారించింది. అర్హత లేనివిగా తిరస్కరించిన దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాలో 585 కాగా, రంగారెడ్డి జిల్లాలో 8,986 ఉన్నాయి. -
క్రమబద్ధీకరణకు నేటితో ఆఖరు
- చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులు 13వేలు - గడువు పెంచే ప్రసక్తే లేదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భూముల (ఇళ్ల స్థలాల) క్రమబద్ధీకరణ ప్రక్రియకు శనివారంతో గడువు ముగియనుంది. ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 31తోనే గడువు ముగియగా, చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులను శనివారం వరకే స్వీకరిస్తామని అధికారులు చె బుతున్నారు. ఆపై గ డువు పెంచే ప్రసక్తే లేదని, దరఖాస్తు చేసుకోనివారి నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని పలు జిల్లాల్లో కలెక్టర్లు హెచ్చరి కలు జారీచేశారు. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గడువు పెంచాలని అనుకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డొస్తుందని అధికారులు అంటున్నారు. ఉచిత కేటగిరీలో 3.5 లక్షల దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో శుక్రవారం వరకు 13,054 దరఖాస్తులు, రూ.71.01కోట్ల సొమ్ము ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. -
తెలంగాణ గృహనిర్మాణ మండలి రద్దు
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ గృహనిర్మాణ మండలిని కేబినెట్ రద్దు చేసింది. ఈ సాయంత్రం ప్రారంభమైన కేబినెట్ భేటీ దాదాపు 7 గంటల పాటు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ మండలి పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. * తెలంగాణ పల్లెప్రగతి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం * తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఒకే * భూముల క్రమబద్ధీకరణలో మార్పులకు కేబినెట్ ఆమోదం * తెలంగాణ సాంస్కృతిక వారధి ఏర్పాటుకు ఆమోదం -
భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు
-
భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విధివిధానాలను ఖరారు చేసింది. 125 గజాలలోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 125 - 250 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 50 శాతం రాయితీ... 250 - 500 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 75 శాతం రాయతీ... 500 నుంచి ఆపై బడిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి భూమిని క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రోజు సాయంత్రం భూముల క్రమబద్దీకరణపై ఉత్తర్వులు జారీ చేసి అవకాశం ఉందని సమాచారం. -
క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధర (బేసిక్ మార్కెట్ వాల్యూ)ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు 125 గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్థలాల క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలనే అంశంపై ఏకీభవించిన అఖిలపక్ష ప్రతినిధులు.. ఆపైబడిన స్థలాల క్రమబద్ధీకరణకు శ్లాబ్‌ల వారీగా నిర్దిష్ట ధరలను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతికి ఊరట! పేదలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం.. 126-250 గజాల వరకు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల విషయంలోనూ కొంత ఉదారత ప్రదర్శిస్తోంది. అల్పాదాయవర్గాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణకు నామమాత్రపు రుసుమును వసూలు చేయాలన్న ప్రతినిధుల అభిప్రాయానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని, ఆక్రమితులు కూడా క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. అలాగే రెగ్యులరైజ్‌కు కేటగిరీల వారీగా ధరలను నిర్దేశించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 126-250 గజాలకు ఒక ధర, 256-500 చదరపు గజాల వరకు ఇంకో ధర, 500 గజాల పైబడిన స్థలాలకు భారీ మొత్తంలో వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, 500 గజాల వరకు క్రమబద్ధీకరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టాలని, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలావుండగా, స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధరనుప్రామాణికంగా తీసుకోవాలని మెజారిటీ ప్రతినిధులు పట్టుబట్టగా, ప్రస్తుత ధరను నిర్దేశించాలని మరికొన్ని పార్టీలు వాదించాయి. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా, కట్టడాలు మినహా ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించకూడదని సర్కారు భావిస్తోంది. కాగా, ప్రభుత్వం క్రమబద్ధీకరణపై విధానపర నిర్ణయం తీసుకుంటే జిల్లాలో 1.01 లక్షల నిర్మాణాలకు ప్రయోజనం చేకూరనుంది. -
125 గజాల లోపు ఉచితంగా క్రమబద్ధీకరణ: కేసీఆర్
హైదరాబాద్ నగరంలో 125 గజాల లోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా ఆయా భూములను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 250-300 గజాలలోపు నివాసం ఉంటున్న మధ్యతరగతి వారికి కొద్దిపాటి ధరతో క్రమబద్ధీకరిస్తామన్నారు. 500 గజాలలోపు నివాసం ఉండేవారికి 100 గజాలకు చొప్పున ధర పెంచుతూ క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో భూకబ్జాల దుకాణం బంద్ కావాలని, పేదలకు నీడ కల్పించేందుకు ఉదారంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. భూముల క్రమబద్ధీకరణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీల ముందు పలు ప్రతిపాదనలను కేసీఆర్ పెట్టారు. 500 గజాలపైన నివాసం ఉండేవారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి క్రమబద్ధీకరిస్తామన్నారు. 15 నుంచి 50 గజాల లోపు స్థలంలో ఎవరైనా నివాసం ఉంటుంటే, వారికి అదేచోట ఇల్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూముల క్రమబద్ధీకరణ కోసం అధికారులు, వివిధ పార్టీల నేతలతో కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. -
క్రమబద్ధీకరిస్తే మంచిది!
* గురుకుల్, అయ్యప్ప భూములపై తెలంగాణ ప్రభుత్వం యోచన * మార్కెట్ రేటుతో ఖజానాకు ఆదాయం.. వివాదాలకు ఫుల్స్టాప్..! * అధికారుల ప్రతిపాదనలపై సర్కారు దృష్టి సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీల్లోని భూముల ఆక్రమణలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వందల ఎకరాలు ఆక్రమణకు గురై అనధికార నిర్మాణాలు ఇప్పటికే పూర్తవడం, కొన్ని నిర్మాణంలో ఉన్న విషయం విదితమే. వీటిని ప్రస్తుత మార్కెట్ ధరకు క్రమబద్ధీకరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తద్వారా ఖజానాకు ఆదాయం రావడంతోపాటు, వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టినట్లు అవుతుందని అధికారులు ప్రభుత్వానికి సూచిం చినట్లు తెలిసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ధరలకు కాకుండా ప్రస్తుత మార్కెట్ ధరలకు ఆక్రమణదారులకు అప్పగిస్తే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అధికారవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేయడం ద్వారా ఇకపై కబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్న సంకేతాలు ఇవ్వగలిగామని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి, నిర్మాణాలు పూర్తయి ఆ భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటిని కూల్చడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విద్యుత్, మంచినీరు మూడు రెట్లు ఛార్జీలు కొనసాగిస్తూనే క్రమబద్దీకరణకు ఒక గడువు పెట్టాలని ప్రతిపాదించారు. చెరువుల పరిరక్షణలో మాత్రం పూర్తి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములపై సర్వేను అధికారవర్గాల ఇదివరకే చేపట్టాయి. స్థలాలు అన్యాక్రాంతం అయినచోట వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అలాంటి భూములను పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకోవడం, అవసరమైనచోట గృహ నిర్మాణం, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. భవన నిర్మాణాలు వచ్చినచోట మాత్రమే క్ర మబద్ధీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం.