
సాక్షి, హైదరాబాద్: ఆక్రమిత ప్రభుత్వస్థలాల క్రమబద్ధీకరణకుగాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 58, 59 జీవోలకు అనుగుణంగా ఈ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో 14ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవో అమలుకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో రూ.వెయ్యి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో జీవో 59లో పేర్కొన్న విధంగా దరఖాస్తు సమయంలోనే ప్రభుత్వ విలువలో 12.5 శాతం డిపాజిట్ రూపంలో మొదటి వాయిదా కింద చెల్లించాల్సి ఉండగా, ఈసారి ఆ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
వ్యక్తిగత ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారుల ఆధార్‌కార్డు, కబ్జాలో ఉన్నట్టు నిరూపించేందుకుగాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, విద్యుత్, నీటిబిల్లు రసీదులు, స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల్లో ఏదో ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది. ఆక్రమితస్థలం ఫొటోను కూడా దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు ఇదే తుది అవకాశమని కూడా ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment