
శంషాబాద్‌కు చెందిన దయానంద్‌రెడ్డికి మండల పరిధిలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వాటికి ఎల్‌ఆర్‌ఎస్ చేయించేందుకు సమీపంలోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో సంప్రదించగా ఒక్కో దరఖాస్తుకు రూ. 2 వేలు అవుతుందని చెప్పడంతో ఆ మేరకు రూ. 8 వేలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గంట తర్వాత నాలుగు రిసిప్ట్‌లను దయానంద్‌రెడ్డి చేతిలో పెట్టాడు. తీరా రిసిప్ట్‌లను పరిశీలిస్తే నాలుగింటికి కలిపి రూ. 4,180 మాత్రమే దరఖాస్తు ఫీజు అయినట్లుంది. మిగతా మొత్తంపై ఆరా తీయగా దరఖాస్తు చేసినందుకు సర్వీసు చార్జీ తీసుకున్నట్లు కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో నోట మాటరాలేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే రూ. వెయ్యి వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడాన్ని కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ దరఖాస్తుదారుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల ప్రకారం ఒక ప్లాట్ కోసం చేసుకొనే దరఖాస్తుపై రూ.వెయ్యితోపాటు అదనంగా రూ. 45 జీఎస్టీ రూపంలో చెల్లించాలి. అదేవిధంగా లేఅవుట్ దరఖాస్తుకు రూ. 10 వేలతోపాటు జీఎస్టీ చెల్లించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్లో లేఅవుట్ దరఖాస్తుల కంటే వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులే అధిక సంఖ్యలో ఉంటున్నాయి.
సర్కారు ఆదాయాన్ని తలదన్నేలా..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ విధానం, దరఖాస్తు తీరుపై సరైన ఆవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవ, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులనే ప్రొత్సహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియకు తెరలేచింది. ఎక్కడికక్కడ దరఖాస్తు కేంద్రాలు తెరవడంతో అర్జీలు పెట్టుకొనే వారంతా ఇలాంటి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ కేంద్రాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు మాత్రం చేతిచమురు వదిలిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై డబుల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ. 1,545 నుంచి రూ. 2,045 వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయ్యే ఫీజుల కంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే మధ్యవర్తులే అధికంగా సంపాదిస్తుండడం గమనార్హం.
అందరికీ అందుబాటులో...
ఎల్‌ఆర్‌ఎస్ పథకం దరఖాస్తు విధానం అత్యంత సులభంగా ఉంది. కానీ ఈ దరఖాస్తు చేసుకొనే తీరుపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ట్యాబ్‌లలో దేని ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం నింపాక దరఖాస్తుదారు తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదటి పేజీని, లేఅవుట్ నమూనాను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లను ఎంట్రీ చేసి నిర్దేశించిన ఫీజును ఆన్‌లైన్ ఖాతా లేదా ఏటీఎం కార్డు, టీవ్యాలెట్ యాప్‌ల ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రసీదు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment