సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్‌ఆర్‌ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది.
తగ్గనున్న భారం..
2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర
భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం.
శ్లాబులు 4 నుంచి 7కి పెంపు..
లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి.
‘ఎల్‌ఆర్‌ఎస్’ ఊరట
Published Fri, Sep 18 2020 1:54 AM | Last Updated on Fri, Sep 18 2020 10:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment