సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment