సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్‌ఆర్‌ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది.
ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు!
స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్‌ఆర్‌ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు.
రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్
రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment