రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్‌లోనే!  | Land Registration In Telangana May Start In October | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్‌లోనే! 

Published Sun, Sep 20 2020 2:45 AM | Last Updated on Sun, Sep 20 2020 12:58 PM

Land Registration In Telangana May Start In October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసిన తర్వాతే పటిష్ట పద్ధ తిలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలో చనతో ఉందని, వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూరికార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరా లను సమన్వయ పరుచుకోవడం, ధరణి వెబ్‌ సైట్‌ను అప్‌డేట్‌ చేయడం జరగాలి. రెవెన్యూ చట్టం అమలుపై నూతన మార్గదర్శకాలు వెలు వడాలి. దీంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని, భూముల మార్కెట్‌ విలువల సవరణ కసరత్తు పూర్తి చేయాలని, అదే విధంగా కొత్త రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ పూర్తిస్థాయిలో అందు బాటులోకి రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుందని సచి వాలయ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి పది రోజులు దాటుతున్నందున... మరో పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, అక్టోబర్‌ మొదటి వారంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నాయి. 

సవరణ... ఆధునీకరణ
ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూముల మార్కెట్‌ విలువలను సవరించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూముల విలువల సవరణ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్‌రిజిస్ట్రార్లు, రెవెన్యూ వర్గాల నుంచి భూముల మార్కెట్‌విలువలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ప్రస్తుత విలువలు, సవరించాల్సిన విలువల విషయంలో పారదర్శకత లోపించిందనే కారణంతోనే మార్కెట్‌ విలువల సవరణ కసరత్తును ప్రభుత్వం థర్డ్‌ పార్టీకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్‌ వర్గాలు చెపుతున్నాయి. సరళీకరణ, హేతుబద్ధీకరణ కోణంలో మార్కెట్‌ విలువలను సవరించాలని, అవసరమైన చోట్ల తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న మార్కెట్‌ విలువలను సవరించి ఆరేళ్లు దాటుతున్నందున కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, హైవేల చుట్టుపక్కల ప్రాంతాలు, ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్సులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల మార్కెట్‌ విలువలను పెంచే దిశలో కసరత్తు జరుగుతోంది. 

అల్పాదాయ ఆఫీసుల ఎత్తివేత
దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ లావాదేవీలు జరిగి, స్వల్ప ఆదాయం వచ్చే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఎత్తివేయాలని, అదే విధంగా అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రెండు లేదా మూడుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని 25వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఎత్తివేసి అర్బన్‌ ప్రాంతాల్లో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పనిలోపనిగా సబ్‌రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలోని ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరగనుండగా, ఈ మేరకు డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను కూడా ఆధునీకరించాలని, వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో జరిగే డాక్యుమెంట్ల రూపకల్పనలో తప్పులు జరిగితే వారినే బాధ్యులను చేయాలని, అవసరమైతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లుగా పనిచేస్తున్న వారి విద్యార్హత, అనుభవానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అక్టోబర్‌ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.  
పని విభజన కోసం..
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు, ఇతర భవనాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న ఇతర కార్యకలాపాలను సబ్‌రిజిస్ట్రార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల సమన్వయం, వాటిని ధరణి వెబ్‌సైట్‌తో పాటు కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఇమిడ్చే పనిలో ప్రభుత్వ వర్గాలున్నాయి. దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఇది ముగిసేలోపు ధరణి వెబ్‌సైట్‌ను కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement