సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.ప్రస్తుతానికి కార్డు (CARD) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ముందస్తు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఆదేశించారు.
కాగా, వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసే దాకా స్లాట్ బుకింగ్‌ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment