ఇంటితో పాటు ఖాళీ స్థలముంటే ఓకే..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సొమ్ము చెల్లింపు కేటగిరి (జీఓ 59)లో ఇంటితోపాటు ఓపెన్ ప్లాటు ఉన్నట్లయితే ఆ దరఖాస్తులను కూడా క్రమబద్ధీకరించడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం తాజాగా నివేదిక సమర్పించింది.
ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే అనర్హతలో ఉన్న 50 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అదనపు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిని తరలించటం కష్టంగా ఉంటుందన్న అభిప్రాయంతో అధికార యంత్రాంగం ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జిల్లాలో ఈ కేటగిరి కింద 942 దరఖాస్తులు రాగా, 357 దరఖాస్తులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి. రంగారెడ్డి జిల్లాలో జీవో 59 కింద 11,744 దరఖాస్తులు రాగా, 2,758 దరఖాస్తులు అర్హత సాధించినట్లు రెవెన్యూ యంత్రాంగం నిర్ధారించింది. అర్హత లేనివిగా తిరస్కరించిన దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాలో 585 కాగా, రంగారెడ్డి జిల్లాలో 8,986 ఉన్నాయి.