అవసరమైతే మావోయిస్టులతో చర్చలు
- హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
శామీర్‌పేట: మావోయిస్టుల ఎజెండే తమ ప్రభుత్వ ఎజెండా అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో జరిగిన 12వ బ్యాచ్ సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టులకు కావాల్సింది పేదలకు భూములు పంచడం.. సంక్షేమ ఫలాలు అందడం లాంటివని, వీటిని తమ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. అలాంటప్పుడు మావోయిస్టులతో సమస్య ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా వారితో మాట్లాడుతారని, ఇందులో భేషజాలు లేవన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా ఇక్కడ మావోయిస్టుల మెరుపుదాడులు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.