తెలంగాణలో మావోయిస్టులు లేరు: హోం మంత్రి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అసలు మావోయిస్టులే లేరని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. వాళ్ల కార్యకలాపాలు ఏవీ ఇక్కడ సాగడం లేదని, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందని ఆయన అన్నారు. హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐల 12వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పెరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణకు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిచేసి 14 మంది జవాన్లను హతమార్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయనిలా చెప్పారు. భూమిలేని వాళ్లకు భూములు ఇవ్వడం, వృద్ధులకు, వికలాంగులకు పింఛను మొత్తాన్ని పెంచడం, చెరువుల పునరుద్ధరణ, రోడ్డు సౌకర్యాలను మెరుగుపరచడం లాంటి మావోయిస్టుల డిమాండ్లను తాము ఇప్పటికే అమలుచేస్తున్నామని, అందువల్ల వాళ్లకు ఇక్కడ ఎజెండా అంటూ ఏమీ లేదని నాయిని సూత్రీకరించారు.