వారి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి
ప్రభుత్వానికి పోలీసు అధికారుల సూచన
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టులకు సంబంధించి ఏం చేయాలన్నా.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా వారితో చర్చల ప్రతిపాదన తీసుకురావద్దని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల పట్ల సర్కారు విధానం ఎలా ఉంటోందనన్న ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఆయుధాలను వీడి వస్తే చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
అయితే, మావోయిస్టులకు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఆదరణ లేదని, వారి కార్యకాలపాలు పెద్దగా సాగడం లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి గుర్తు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ కార్యకలాపాలు విశాఖ ఏజెన్సీ ఏరియాలోనే సాగుతున్నాయని, ఉత్తర తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మినహా ఇతరచోట్ల ఏ కార్యకలాపాలు లేవని వారు తెలిపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని అధికారులు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి మావోయిస్టుల పట్ల అనుసరించాల్సిన విధానంపై తమ వైపు నుంచి కూడా ఒక అంతర్గత నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సాగుతున్న మావోయిస్టు కార్యకలాపాల నుంచి మాత్రమే తగు జాగ్రత్తలతో, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా నిఘా విభాగం తెలిపింది.