మావోయిస్టులతో చర్చలకు సిద్ధం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు: మావోయిస్టులను తిరిగి జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా చర్చలతో పాటు చట్టపరిధిలో అన్ని చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై విపక్ష భారతీయ జనతా పార్టీ అనవరసర రాద్ధాంతం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన విగ్రహం వద్ద శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మావోయిస్టులను జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా వారితో చర్చలు జరపడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో పాత్రికేయులు గౌరిలంకేష్‌కూడా ఒకరు. బీజేపీ నాయకులకు సమాజంలోని అందరూ చెడ్డవారుగా కనిపిస్తారు. అందువల్లే గౌరిలంకేష్‌ను బృందం నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే వారి ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గం. మావోయిస్టులను జనజీవన శ్రవంతిలో కలిపే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయము.’ అని స్పష్టం చేశారు.
గౌరి లంకేష్‌ను తప్పించండి.....
నక్సల్స్‌తో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలోని గౌరి లంకేష్‌ను వెంటనే ఆ స్థానం నుంచి తప్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలను శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలవడానికి వీలుగా రూపొందించిన ‘ప్యాకేజీ’ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు అందుతోందని వారు వినతి పత్రంలో ఆరోపించారు. ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు వజుభాయ్ రుడాభాయ్‌వాలతో పేర్కొన్నారు. కాగా, గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప, సీ.టీ రవి తదితరులున్నారు.