నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదు
ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి భేటీ
దాడులను తిప్పికొట్టాలని పిలుపు
ఒకే విధానాన్ని అనుసరించాలి
బలగాల ఆధునీకరణ, నిధుల
పెంపునకు రాజ్‌నాథ్ హామీ
న్యూఢిల్లీ: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే నక్సల్ హింసను అరికట్టేందుకు రాష్ట్రాలతో కలిసి తగిన విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేసింది. మావోయిస్టు ప్రభావితమైన పది రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు సమస్యపై జరిగిన తొలి సమావేశం ఇదే. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ ప్రాథమ్యాలను వివరించిన రాజ్‌నాథ్... మావోయిస్టులు విసిరే సవాళ్లను తిప్పికొట్టే విధంగా ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను సర్వ సన్నద ్ధం చేయడానికి తగిన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక పరికరాలను సమకూర్చి బలగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండబోవని, వారి దాడులను సమర్థంగా ఎదుర్కోవాలని పోలీసులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలూ ఒకే విధానాన్ని అనుసరించాలని రాజ్‌నాథ్ సూచించారు. భద్రత పెంపు, అభివృద్ధి, సాధికారత, సంక్షేమ పథకాల అమలు మార్గాలను అనుసరించి మావోయిస్టు సమస్యను అధిగమించవచ్చని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన ప్రత్యేక పోలీస్ దళం గ్రేహౌండ్స్ తరహాలో తొలి విడతగా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దళాల ఏర్పాటుకు సహకరిస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించేలా రివార్డు మొత్తాన్ని పెంచాలని, మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొనే పోలీసుల భత్యాలను కూడా పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నక్సల్ ప్రభావిత జిల్లాలకు భద్రతా నిధులను భారీగా పెంచనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ అధిపతులు కూడా హాజరయ్యారు. కాగా, మావోయిస్టులు హింసను వీడి చర్చలకు ముందుకొచ్చినపక్షంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుందని ఈ భేటీ తర్వాత హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.