What Is Telangana Go 111: Telangana People Opinion About Kcr Announcement Of Revoke GO 111 - Sakshi
Sakshi News home page

సర్వత్రా చర్చ.. హాట్‌ టాపిక్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటన   

Published Fri, Mar 18 2022 2:04 PM | Last Updated on Fri, Mar 18 2022 3:20 PM

CM KCR Announcement Hot Topic: Discussion On GO 111 In Telangana - Sakshi

మొయినాబాద్‌(రంగారెడ్డి జిల్లా): ప్రస్తుతం చర్చంతా 111 జీవోపైనే సాగుతోంది.  సీఎం కేసీఆర్‌ మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేసింది మొదలు స్థానికంగా ఎక్కడ చూసినా ‘జీవో ఎత్తేస్తారంట కదా..’ అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. జీవో పరిధిలోని గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఇది ఎన్నికల స్టంట్‌ అంటూ విమర్శిస్తున్నాయి.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిర్వాకం.. మహిళ కాల్‌ రికార్డింగ్‌, వీడియోలు, ఫోటోలతో..

ఇదీ జీవో కథ..  
హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించడంకోసం నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను నిర్మించారు. జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. జలాశయాలకు వరదనీరు వచ్చే ఎగువ ప్రాంతంలో ఉన్న ఏడు మండలాల్లోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చింది. నిబంధనల ప్రకారం ఈ గ్రామాల పరిధిలో కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు, లేఅవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు వీల్లేదు. దీంతో ఈ ప్రాంతంలో నగర విస్తరణ జరగలేదు. జంట జలాశయాల కింది భాగం వరకు పెద్ద నిర్మాణాలు చేపట్టి నగర విస్తరణ జరిగినా జలాశయాలను దాటి మాత్రం రాలేదు. స్థానికంగా భూముల ధరలు పెరగలేదు.

అందరికీ ప్రచారాస్త్రం
జీవో కారణంగా కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం.. భూముల ధరలు పెరగడంలేదంటూ స్థానిక రైతులు, ప్రజలు వ్యతిరేకించారు. 2007లో 111 జీవో వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేపట్టారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు జీవో ఎత్తివేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. రాజకీయ పారీ్టలు సైతం ఈ జీవోను ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. రెండు సార్లు టీఆర్‌ఎస్‌ కూడా జీవోను ఎత్తేస్తామని హామీ ఇచ్చింది.

సీఎం ప్రకటనతో.. 
‘హైదరాబాద్‌ దాహర్తి తీర్చడానికి కృష్ణా, గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నాయని.. జంటజలాశయాల నీళ్లను ఇప్పుడు వాడటం లేదని.. ఇక 111 జీవో కాలం చెల్లిందని.. ఎత్తివేస్తాం’ అంటూ సీఎం ప్రకటన చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, బస్టాపులు, ఆఫీసులు, రోడ్లపై ఎటు చూసినా ఇదే చర్చ. జీవో నిజంగా ఎత్తివేస్తే తమ భూములకు ధరలు పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇది సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జీవోను ఎత్తివేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్ష పారీ్టల నాయకులు ఇది ఎన్నికల డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయనే ఊహాగానాలతోనే సీఎం ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా 111 జీవోపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి. 

జీవో ఎత్తేస్తేనే మేలు  
111 జీవోతో ఇప్పటి వరకు మా భూములకు ధరలు లేవు. భూమిపై బ్యాంకులో అప్పు తీసుకోవాలన్నా ఇబ్బంది ఉంది. జీవో ఎత్తేస్తే భూ ముల ధరలు పెరుగుతాయి. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 
-మల్లేష్, రైతు, ఎత్‌బార్‌పల్లి 

మా పోరాట ఫలితమే.. 
111 జీవోను వ్యతిరేకిస్తూ 2007 నుంచి పోరాటం చేస్తున్నాం. స్థానికులంతా జీవోను వ్యతిరేకిస్తున్నారు. మా పోరాటంతోనే ఇప్పు డు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను త్వరలోనే నిజం చేయాలి. 
-కొమ్మిడి వెంకట్‌రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట కమిటీ అధికార ప్రతినిధి 

ఇది ఎన్నికల డ్రామా 
సీఎం కేసీఆర్‌ 111 జీవోను ఎన్నికల స్టంట్‌గా వాడుకుంటున్నారు. గతంలో రెండుసార్లు జీవో ఎత్తేస్తామని హామీ ఇచ్చా రు. ఇప్పుడు ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని మరోసారి జీవోను తెరపైకి తెచ్చారు. ఇది ఎన్నికల డ్రామాలో భాగమే. 
-మధుసూదన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు, మొయినాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement