మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు..
- ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఇరుదేశాల భద్రత సలహాదార్లు అజిత్ దోవల్(భారత్), సర్తాజ్ అజీజ్ (పాక్) ఢిల్లీలో సమావేశమై ఉగ్రవాద అంశాలపై చర్చిస్తారు. (అజీజ్‌కు పాక్‌లో దార్శనికుడిగా, ఆర్థికవేత్తగా పేరుంది)
- పాక్‌లో జరుగుతున్న 26/11 ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు.. స్వర నమూనాలను అందించడం సహా.. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అంగీకారం. (ఈ విచారణలో తీవ్ర జాప్యం, అలసత్వంపై భారత్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని నిరసించింది. అందుకు బాధ్యత వహించాల్సిన పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలంటూ ఐరాసలో ఒక తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టింది. చైనా అడ్డుకోవడంతో అది వీగిపోయింది)
- వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) డెరైక్టర్ జనరల్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్‌ల మధ్య అతిత్వరలో భేటీ. తర్వాత ఇరుదేశాల డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) భేటీ.
- శాంతి స్థాపన, అభివృద్ధి సాధన ఇరుదేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టీకరణ. ఆ దిశగా, అన్ని అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయం.
- అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని మోదీ, షరీఫ్‌లు తీవ్రంగా ఖండించారు. దక్షిణాసియా నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం.
- పాక్ జైళ్లలో ఉన్న 355 మంది భారత జాలర్లను, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లను, వారి పడవలతో సహా 15 రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయం.
- మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక యంత్రాంగ రూపకల్పన.
- వచ్చే సంవత్సరం ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవాలన్న షరీఫ్ ఆహ్వానానికి మోదీ సానుకూల స్పందన. (2004 జనవరిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాక్ పర్యటన అనంతరం భారత ప్రధాని పాక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం)