న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగానే ఎన్‌ఎస్‌ఏ చర్చలు రద్దయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్-పాక్ ఎన్‌ఎస్‌ఏ చర్చలు రద్దు నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ విదేశాంగ విధానంలో గందరగోళం, గాబరా, మొండితనం తప్ప మరేం లేదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఎద్దేవాచేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. సరైన అనుభవం, ముందు చూపు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మాటలగారడీలు కట్టిపెట్టి ప్రధాని మోదీ.. దేశ అంతర్గత, సీమాంతర ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని హితవు పలికారు. పరిష్కారం చూపే ప్రతిపాదనలతో భద్రతా అంశాలు, శాంతియుతమైన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే విదేశాంగ విధానాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎలాంటి ప్రయోజనం, ఫలితాలు వచ్చే వీలు లేని నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపడం అనవసరమని కాంగ్రెస్ సూచించింది. కచ్చితమైన ఫలితం ఉంటుందని భావిస్తేనే చర్చలు కొనసాగించాలని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ హురియత్‌ను అడ్డుపెట్టుకుని చర్చలను ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌వైపు మళ్లిస్తోందని భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు వీటిని వినియోగించుకుంటోందని ఆరోపించారు. హురియత్‌కు ప్రాధాన్యత ఇవ్వవద్దన్నారు. పాకిస్థాన్ నిర్ధారించకుండానే చర్చల కోసం తేదీలను ఎలా ప్రకటించారని కేంద్రాన్ని నిలదీశారు.
మోదీ వైఫల్యంతోనే చర్చలు రద్దు: కాంగ్రెస్
Published Sun, Aug 23 2015 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement