ఓట్ల కోసమే బిహార్‌కు ప్యాకేజీ
మోదీ సర్కారుపై రాహుల్‌గాంధీ ధ్వజం
అమేథీ: ప్రధాని మోదీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఓట్ల కోసమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇలా జిమ్మిక్కులు చేయడం ఆయనకు అలవాటేనన్నారు. ఈ ప్యాకేజీ హామీ కూడా జవాన్లకు ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’(ఓఆర్‌ఓపీ) మాదిరే అవుతుందేమోనని పేర్కొన్నారు. ‘బిహార్‌కు ప్యాకేజీ ఇవ్వడానికి, విదేశీ పర్యటనలకు వెళ్లడానికి మోదీకి డబ్బు లు ఉంటాయి. అదే మన జవాన్లకు, మాజీ సైనికులకు ఇవ్వడానికి మాత్రం డబ్బుల్లేవంటారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ముందూ ఆయన యూపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓఆర్‌ఓపీ అమలు చేస్తామని లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారా?’ అని ప్రశ్నించారు. అమేథీ పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాణిగంజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ ప్యాకేజీ హామీలు ఇవ్వడం సమయం వృథా చేయడమే. ఆయన మాట్లాడతారు. ప్రజలు వింటారు. తర్వాత ఆయన మరో హామీ ఇస్తారు.
ఈ ప్రపంచం అంతా భ్రమల్లో బతుకుతుందని బీజేపీ, మోదీ భావిస్తున్నట్టున్నారు. పల్లె జనాలు ఇదంతా అర్థం చేసుకోరని వారు అనుకుంటున్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెచ్చి దేశంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ హామీ ఏమైంది?’ అని దుయ్యబట్టారు. అభివృద్ధిని కొలిచే విధానాలన్నింటినీ మార్చేసి.. తామే దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు- బూటు’ సర్కారుగా విమర్శించిన రాహుల్ మళ్లీ ఆ దాడిని కొనసాగించారు. సామాన్యుల కోసం పనిచేసేందుకు కుర్తా- పైజామా సర్కారు వస్తుందన్నారు.