మోదీజీ.. ఇప్పటికైనా లేచి పనిచేయండి: రాహుల్
ప్రధాని నరేంద్రమోదీ ఏం చేస్తారోనని దేశ ప్రజలు ఏడాది పాటు వేచిచూశారు గానీ, ఆయన బండి ఇంకా స్టార్ట్ కాలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన లేచి బండి స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ తొక్కాలని, లేకపోతే ప్రజలే బండి తలుపులు తెరుచుకుని లోపలకు వచ్చి మిమ్మల్ని బయటకు తోసేస్తారని అన్నారు. బిహార్ ఎన్నికలలో మహాకూటమి విజయం ఖాయమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ చాలా ఉల్లాసంగా కనిపించారు. రాహుల్ ఏమన్నారంటే..
- నమస్కారం.. ఈవాళ మీరు ఏం ప్రశ్నలు వేస్తారు.. ముందుగా నేను మహాకూటమి కార్యకర్తలకు, నేతలకు అభినందనలు చెబుతాను.
- నితీష్, లాలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. అందరికీ అభినందనలు.
- ఇది కోపం మీద, క్రోథం మీద మేం సాధించిన పెద్ద విజయం.
- ఇది మోదీకి ఒక సందేశం. ఈ సందేశం దేశమంతా వ్యాపిస్తోంది. దాన్ని ఆయన విని అర్థం చేసుకోవాలి.
- ఆయన దేశానికి ప్రధానమంత్రి.. దేశమంతా చెబుతోంది..
- ఈ దేశాన్ని నరేంద్ర మోదీ గానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గానీ విడదీయలేవు. హిందు- ముస్లింల మధ్య విభేదాలు తేలేరు.
- ఈ దేశం ఏదో ఒక జాతి, మతానిది కాదు.. అందరిదీ. అందరికీ స్థానం ఉండాలి, ప్రేమాభిమానాలు ఉండాలి.
- బీజేపీ, నరేంద్ర మోదీలు తమకొచ్చిన గర్వాన్ని కొంత దూరం చేసుకోవాలి.
- ఆయన దేశానికి ప్రధానమంత్రి. అలా గర్వాన్ని దూరం చేసుకుంటే ఆయనకు, దేశానికి కూడా ఉపయోగం ఉంటుంది
- నితీష్ కుమార్కు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎన్నికలకు ముందు కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం.
- బిహార్ లో ఆయన అభివృద్ధి సాధిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది.
- ప్రభుత్వంలో భాగస్వామ్యం గురించి చర్చలు జరిగిన తర్వాత వాటిలోనే తేలుస్తాం తప్ప.. ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పలేం.
- మాది ఎన్డీయేపై విజయం కాదు.. కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీల మీద పోరాటం లాంటిదే.
- ఈ దేశం అందరిదీ. మేధావులు, కళాకారులు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు.
- మీరు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ప్రచారాలు, ప్రసంగాలు ఇక ఆపేసి.. పని మొదలుపెట్టండి.
- దేశం ఏడాది పాటు వేచి చూసింది. ఇంకా మీ బండి స్టార్ట్ కాలేదు.
- దాన్ని స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ తొక్కండి.
- లేకపోతే.. మీ బండి తలుపును ప్రజలే తెరిచి బయటకు తోసేస్తారు.
- మోదీకి మరో సలహా.. మీరు ఇంగ్లండ్, అమెరికా, చైనా వెళ్లి.. పాకిస్థాన్ గురించి చెబుతారు.
- అక్కడకు వెళ్లడం కాదు.. మన దేశంలో రైతులు, కార్మికులను కలవండి. వాళ్లను అక్కున చేర్చుకోండి.