'ఒంటరిగా దేశాన్ని నడిపించాలనుకుంటున్నారు'
పాట్నా: బీజేపీదైనా ఆరెస్సెస్దైనా విభజించి పాలించడమే వాటి అజెండా అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించాడు. ఆ రెండిటి ఆలోచన ధోరణి, సిద్ధాంతం ఒకటే అని మండిపడ్డారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించిన నేపథ్యంలో సోమవారం బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ స్పందించారు. 'దేశం నరేంద్రమోదీని చాలా ఆశించింది. ఆయన కూడా చాలా హామీలు ఇచ్చారు.
కానీ ఒక్కటి అమలుచేయలేదు.ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మోదీ ఒక్కరే ఒంటరిగా దేశాన్ని నడపాలని అనుకుంటున్నారు. ఇది అందరి దేశం. దేశ పురోభివృద్ధికి ప్రజలందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం వారు అర్థం చేసుకుంటే చాలా మంచిది' అని రాహుల్ అన్నారు. బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతుందని ఆ పార్టీ నాయకులందరికీ తెలిసిపోయిందని అన్నారు. తాను నితీశ్ కుమార్ను కలిశానని, తమ ఇద్దరి ఆలోచనలు ఒక్కటేనని చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం తాను నితీశ్ కుమార్తో కలిసి పనిచేస్తానని చెప్పారు.