
పట్నా: మోదీ ఇంటిపేరు వివాదంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేసిన పరువునష్టం కేసులో ఏప్రిల్ 25న కోర్టు ఎదుట హాజరవ్వాలని రాహుల్‌గాంధీని బిహార్ కోర్టు బుధవారం సూచించింది. ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో వేసిన పిటిషన్ విచారణను బుధవారం కోర్టు ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆది దేవ్ చేపట్టారు. ఏప్రిల్ 12వ తేదీనే హాజరవ్వాలని గత నెల 18న ఆయన ఆదేశాలివ్వడం తెల్సిందే.
హాజరుపై రాహుల్ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. సూరత్ కోర్టు కేసులో రాహుల్ తరఫు లాయర్ల బృందం తలమునకలైనందున రాహుల్ హాజరవాల్సిన తేదీని మార్చాలని కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ రాహుల్‌ను 25వ తేదీన హాజరుకావాలంటూ సమన్లు జారీచేశారు. మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు విధించడం, ఎంపీగా అనర్హత వేటు పడటం తెలిసిందే.