శుక్రవారం రష్యాలోని ఉఫాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం
భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో కీలక ముందడుగు.. రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా పేలుతున్న మాటల తూటాలకు విరామం..దాయాది దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా మరో ప్రయత్నం.. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు అంగీకారం.. సరిహద్దుల్లో ఉద్రిక్తతను చల్లార్చేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభం.. దక్షిణాసియా నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలనే విషయంలో ఏకాభిప్రాయం.. ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు సానుకూలత.. కశ్మీర్ ప్రస్తావన లేని సంయుక్త ప్రకటన.. దాదాపు పుష్కరం తరువాత ఒక భారత ప్రధాని పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్న చారిత్రక సందర్భం..! భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య శుక్రవారం రష్యాలోని ఉఫాలో జరిగిన కీలక భేటీ సాధించిన విజయాలివి.
- తొలగిన ప్రతిష్టంభన; త్వరలో ఇరుదేశాల భద్రత సలహాదారుల సమావేశం
- రష్యాలో మోదీ, షరీఫ్‌ల ప్రత్యేక భేటీ
- సంయుక్త ప్రకటన విడుదల చేసిన విదేశాంగ కార్యదర్శులు
- ముంబై దాడుల విచారణ వేగవంతం
- సరిహద్దు దళాల డీజీల భేటీ.. బోట్లతో సహా మత్స్యకారుల విడుదల
- కశ్మీర్ ప్రస్తావన లేకపోవడంపై పాక్‌లో నిరసన
- 2016లో పాక్ వెళ్లనున్న మోదీ
ఉఫా(రష్యా): భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. కశ్మీర్ ప్రస్తావన లేకుండా సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు.
ఆ తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఎస్.జైశంకర్, ఇజాజ్ అహ్మద్ చౌధరి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అందులో భారత్, పాక్‌ల మధ్య సంబంధాలను మెరుగుపర్చే దిశగా ఐదు పాయింట్ల రోడ్‌మ్యాప్‌లు ఆవిష్కరించారు. సంయుక్త ప్రకటనలో కానీ, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సంయుక్త మీడియా సమావేశంలో కానీ కశ్మీర్ సమస్య ప్రస్తావన రాకపోవడం గమనార్హం. ఉఫాలో మోదీ, షరీఫ్‌ల మధ్య చర్చల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు సడలేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సంయుక్త ప్రకటనలో వివరించారు.
కశ్మీర్ ప్రస్తావన ఉండాల్సింది
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా, దార్శనికుడిలా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యవహరించారని భారత్ ప్రశంసించింది. ‘ఈ రోజు(శుక్రవారం) తీసుకున్న నిర్ణయాలపై సంతోషంగా ఉన్నారా?’ అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ‘అవును’ అంటూ షరీఫ్ సమాధానమిచ్చారు. మోదీ, షరీఫ్‌ల భేటీ ఒక సానుకూల ముందడుగు అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే, సంయుక్త ప్రకటనలో కశ్మీర్ సమస్య ప్రస్తావన లేకపోవడంపై పాక్ ప్రతిపక్షాలు, మీడియా షరీఫ్‌పై విరుచుకుపడ్డాయి. కశ్మీర్ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, సంయుక్త ప్రకటనలో ఆ ప్రస్తావన ఉండాల్సి ఉందని మాజీ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు.
మళ్లీ ఏడాది తరువాత..!
గత సంవత్సరం మేలో నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ హాజరైన సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నవంబర్‌లో కఠ్మాండూలో జరిగిన సార్క్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కలుసుకున్నప్పటికీ ముక్తసరిగానే మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రత్యేక చర్చలేవీ చోటు చేసుకోలేదు.
తరువాత ఇద్దరు నేతలు సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం, ఇరుదేశాల మైత్రికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువరించడం ఇదే ప్రథమం. గత సంవత్సరం ఆగస్ట్‌లో భారత్, పాక్‌ల విదేశాంగ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్‌లో చర్చలు జరగాల్సి ఉండగా.. ఈ చర్చలకు సంబంధించి ఢిల్లీలోని పాక్ రాయబారి కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారత్ చర్చల్లోంచి తప్పుకుంది.
తుర్క్‌మెనిస్తాన్‌కు మోదీ..
మూడు రోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ శుక్రవారం తుర్క్‌మెనిస్తాన్‌కు వెళ్లారు. ‘రష్యా పర్యటన సంతృప్తికరం. భేటీలు, చర్చలు ఫలప్రదంగా జరిగాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో మోదీ భేటీ అయ్యారు. అఫ్ఘాన్ భద్రత, ఆ దేశంలో భారత సహాయక చర్యలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.