మోడీ తల్లికి షరీఫ్ బహుమతి
న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య సత్సంబంధాల మాటేమో కానీ.. రెండు దేశాల ప్రధానమంత్రుల మధ్య మాత్రం బహుమానాల సాక్షిగా మంచి అనుబంధం ఏర్పడింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి మోడీ అందమైన షాల్‌ను కానుకగా పంపిస్తే.. మోడీ మాతృమూర్తి హీరాబెన్‌కు షరీఫ్ అద్భుతమైన తెల్లని చీరను బహూకరించారు. ఈ విషయాన్ని గురువారం మోడీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నవాజ్ షరీఫ్ మా అమ్మ కోసం అందమైన తెల్లని చీరను పంపించారు. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు.
త్వరలోనే ఆ చీరను అమ్మకు పంపిస్తాను’ అని మోడీ ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోడీ తన నానమ్మకు పంపిన షాల్ చాలా బాగుందంటూ నవాజ్ షరీఫ్ కూతురు మార్యమ్ నవాజ్ షరీఫ్ కూడా గతంలో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మీరు నానమ్మకు పంపిన బహుమతికి థాంక్యూ వెరీమచ్ పీఎం నరేంద్రమోడీ.. మా నాన్నగారు దాన్ని స్వయంగా మా నానమ్మకి ఇచ్చారు’ అని ఆమె ట్వీట్ చేశారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవాజ్ షరీఫ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరువురి మధ్య భావోద్వేగపూరిత సంభాషణ జరిగినట్లు ఆ తరువాత మోడీ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం హీరాబెన్ మోడీకి స్వీట్లు తినిపిస్తున్న చిత్రాలు తనను, తన తల్లిని ఎంతో కదిలించాయని షరీఫ్ చెప్పినట్లు మోడీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతీవారం తన తల్లి దగ్గరకు వెళ్తానని షరీఫ్ చెప్పారన్నారు.