మోదీ.. షరీఫ్.. కటీఫ్!
కఠ్మాండు: సార్క్ సదస్సు వేదికగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ‘చీర, షాల్’ల డిప్లొమసీ ముగిసింది. ఇరుదేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు బుధవారం సార్క్ దేశాధినేతల ప్రారంభ సదస్సు సందర్భంగా వేదికపై ఎడమొగం, పెడమొగంగా కనిపించారు. కనీసం పలకరించుకోలేదు. సదస్సు వేదికపైకి వచ్చిన షరీఫ్ మోదీని పట్టించుకోకుండా, మోదీ వైపు చూడకుండానే తన స్థానం వద్దకు వెళ్లి కూర్చున్నారు. తరువాత, సదస్సులో ప్రసంగించేందుకు నవాజ్ షరీఫ్‌ను నిర్వాహకులు ఆహ్వానిస్తూ.. ఆయన పేరు పిలిచినప్పుడు.. మోదీ సీరియస్‌గా వార్తాపత్రిక చదువుతూ ఉండిపోయారు.
మిగతా నాయకులంతా చప్పట్లు కొట్టి ఆహ్వానించినా.. మోదీ స్పందించకుండా పత్రికాపఠనంలో మునిగిపోయారు. అయితే, ప్రసంగించేందుకు మోదీ పేరును పిలిచినప్పుడు మాత్రం.. మిగతా నాయకులతో పాటు నవాజ్ షరీఫ్ చప్పట్లతో ఆహ్వానించారు. సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమం ముగిసిన తరువాత దేశాధినేతలనందరినీ అక్కడే ఉన్న మరో గదిలో కూర్చోవాల్సిందిగా ఆహ్వానించారు. మిగతా నేతలంతా వెళ్లేంతవరకు.. మోదీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలాతో మాట్లాడుతూ వేదికపైనే కూర్చున్నారు. ‘ముంబైపై ఉగ్రవాద దాడులు జరిగిన రోజే.. పాక్ ప్రధానితో మోదీ ఎలా కరచాలనం చేయగలరు? ఎలా ఆలింగనం చేసుకోగలరు?’ అని భారతీయ దౌత్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కఠ్మాండులోని ఒకే హోటల్‌లో ఈ ఇద్దరు నేతలు బస చేస్తుండటం విశేషం.
సార్క్ సభ్య దేశాలు - హాజరైన అధినేతలు
భారత్: నరేంద్రమోదీ, పాకిస్తాన్: నవాజ్ షరీఫ్,
శ్రీ లంక: మహింద రాజపక్స, నేపాల్: సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్: షేక్ హసీనా, భూటాన్: షెరింగ్ తోబ్గే,
మాల్దీవులు: అబ్దుల్లా యమీన్, అఫ్ఘానిస్థాన్: అష్రాఫ్ ఘనీ