► ప్రొటోకాల్‌ను కూడా పక్కన పెట్టి షరీఫ్ ఇంటికి వెళ్లిన మోదీ...
► మోదీ ప్రభుత్వ వైఖరిలో మార్పునకు కారణం ఏమిటి?
సాక్షి సెంట్రల్ డెస్క్: మూడు నెలల క్రితం వరకూ ఉప్పూనిప్పుగా ఉన్న దాయాదులు.. ప్రతిరోజూ సరిహద్దుల వెంట నిరాఘాటంగా కాల్పులతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులు.. వేర్పాటువాదులతో సమావేశమవుతామన్నం దుకు, ఉఫా అజెండాను తోసిరాజన్నందుకు.. జాతీయ భద్రతాసలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) సమావేశాన్నే రద్దు చేసుకున్న ఆవేశకావేశాలు.. కశ్మీర్‌లో పాక్ జెండాల రెపరెపలు.. ఉగ్రవాదుల పట్టివేతలు.. పాకిస్తాన్ కళాకారులకు, క్రికెటర్లకు బెదిరింపులు.. ఇంత తీవ్రంగా ఉన్న భారత, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పుడప్పుడే తొలగదనుకున్న వారిని హఠాత్తుగా ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక్కసారిగా కుదిపేశాయి.
పాకిస్తాన్ తన ఎన్‌ఎస్‌ఏను పదవి నుంచి తప్పించేసిన కొద్ది రోజులకే(డిసెంబర్ 6) రహస్యంగా తటస్థ దేశం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఎన్‌ఎస్‌ఏల చర్చలు జరిగిపోయాక కానీ, ప్రపంచానికి తెలియలేదు. అంతకు ముందు కశ్మీర్‌ను అజెండాలో చేర్చాలని డిమాండ్ చేసినందుకు ఎన్‌ఎస్‌ఏ చర్చలు రద్దు చేసుకున్నామన్న భారత్, బ్యాంకాక్ సమావేశంలో ‘రక్షణ, ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్, సరిహద్దుల్లో ఉద్రిక్తతల’పై చర్చించినట్లు పేర్కొంది. ఆ తరువాత రెండు రోజులకే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆసియా సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తోనూ, షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తాజ్ అజీజ్‌తోనూ చర్చలు జరిపారు. భారత్, పాక్‌ల మధ్య తిరిగి చర్చల ప్రక్రియకు తలుపులు తెరిచారు. తాజాగా శుక్రవారం మోదీ ఏకంగా పాకిస్తాన్‌కు వెళ్లి షరీఫ్ ఇంట్లో విందారగించి భారత్‌కు వచ్చేశారు. ఓ ప్రొటోకాల్ లేదు.. సంప్రదాయంగా స్వీకరించాల్సిన సైనిక వందనం ఊసే లేదు.. అన్నింటినీ పక్క న పెట్టి షరీఫ్‌తో అసాధారణ దౌత్యాన్ని మోదీ నిర్వహించారు. పాక్‌తో మోదీ ప్రభుత్వ విధానంలో మార్పు ఒక్కసారిగా వచ్చిందా? దీని వెనుక మతలబు ఏదెనా ఉందా? ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలి శారు. ఇద్దరు నేతల మధ్య ఏకంగా హాట్‌లైన్ కనెక్షనే ఏర్పాటు చేసుకున్నారు.
అటు షరీఫ్‌తోనూ ఆయన గత అయిదు నెలల్లో మూడు సార్లు కలిశారు. భారత్, పాక్‌ల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలని నిరంతరంగా అమెరికా రెండు దేశాలపై ఒత్తిడి తెస్తోంది. మరో పక్క ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోవలసిన తప్పనిసరి పరిస్థితి పాకిస్తాన్‌కు ఏర్పడింది. నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటన తరువాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. భారత్‌కు వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దంటూ తన మంత్రులందరికీ షరీఫ్ హుకుం కూడా జారీ చేశారు. అటు రష్యా నుంచి ‘తాపి’ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంలో పాక్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. పొరుగు దేశం ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించటం భారత్‌కు ఎంతో అవసరం.. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల నేతలు ఒక మెట్టు దిగి దౌత్య ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయిం చారు. ఇది సత్ఫలితాలిస్తుందా అనేది చెప్పడం కష్టం. పాక్‌లో నవాజ్ షరీఫ్ బలహీనుడైన నాయకుడు. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. 2013తో పోలి స్తే 2014లో పాక్‌లో దేశీయంగా జరిగిన ఉగ్రవాద దాడులు, రాజకీయ హింస తగ్గుముఖం పట్టడమే ఇందుకు నిదర్శనం.
పాక్‌లో సైనిక నాయకత్వాన్ని కాదని రాజకీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ప్రస్తుతం లేదు.షరీఫ్ కూడా జనరల్ రహీల్ ఆధిపత్యాన్ని అంగీకరించారు. భారత్‌తో జరిపే చర్చ ల్లో మిలటరీకీ ప్రత్యక్షపాత్ర ఉండాలన్న రహీల్ డిమాండ్‌ను ఆయన కాదనలేదు. అందుకే రహీల్‌కు సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ నసీర్ జన్‌జువాను ఆగమేఘాల మీద ఎన్‌ఎస్‌ఏగా నియమించారు. బ్యాంకాక్ చర్చల్లో పాల్గొన్నదీ నసీరే. ఈ పరిస్థితుల్లో పాక్ పట్ల మోదీ సానుకూల దౌత్య దృక్పథం అక్కడి సైనిక వ్యవస్థను కాదని సత్ఫలితాలను ఇస్తుందా? పాక్ పట్ల మోదీ విదేశాంగ విధానంలో మార్పు కశ్మీర్ కాష్టాన్ని చల్లారుస్తుందా?
గత నెలరోజుల్లో ఏం జరిగింది?
Published Sat, Dec 26 2015 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement