సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఫలించింది. అభ్యర్థుల ప్రకటనపై భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్చలు ఫలప్రదం కావడంతో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ సమ్మతి రాగం వినిపిస్తోంది. భవిష్య త్తులో వచ్చే అవకాశాలపై అధిష్టానం తరఫున హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సైతం పార్టీ అభ్యర్థులతో కలసి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక అసమ్మతికి తెరపడినట్లేనని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
చెన్నూరుతో మొదలు...
రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ వారిని సైతం ఆశ్చర్యపరుస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ఏదైనా కారణంతో అభ్యర్థులను మారు స్తారనే ఆశతో పలువురు ఆశావహులు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేయడం, మరికొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై టీఆర్‌ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది.
టీఆర్‌ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చర్చల వ్యూహం మొదలుపెట్టారు. చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో చర్చలు ఫలించాయి. అనంతరం అన్ని జిల్లాలకు ఇదే సూత్రం అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలకు మధ్య తొలుత అంతరం నెలకొంది. ఉప్పల్‌లో అభ్యర్థిని మార్చాలని కార్పొరేటర్లు గట్టిగా డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ విషయాల్లోనూ ఇదే జరిగింది. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమన్వయం చేసి ఈ సెగ్మెంట్ల అసమ్మతి నేతలను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం అందరూ కలసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారిన స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, మహబూబాబాద్, ఖమ్మం, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, అలంపూర్, నిర్మల్, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, ముథోల్, మంథని, మానకొండూరు, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, నర్సాపూర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, తుంగతుర్తి సెగ్మెంట్ల అసమ్మతి విషయంలోనూ కేటీఆర్ ఇదే సూత్రం అమలు చేశారు. మొత్తంగా ఎన్నికల నోటిఫిషన్‌కు పది రోజుల ముందే టీఆర్‌ఎస్‌లో అసమ్మతులకు దాదాపుగా ముగింపు పలికినట్లయింది. ఇక రామగుండం, భూపాలపల్లి విషయంలోనూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసి దీన్ని పూర్తి చేయనున్నారు.
కల్వకుర్తిలోనూ కథ సుఖాంతం...
కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు అసమ్మతి సెగ సమసిపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పార్టీలో చేరి పోటీ చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండటంతో ఆ దిశగానూ ఆలోచించారు. దీంతో నారాయణరెడ్డి, ఆయన అనుచరులు జైపాల్ యాదవ్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
నారాయణరెడ్డితో మంత్రి కేటీఆర్ గురువారం చర్చలు జరిపారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని నారాయణరెడ్డికి సూచించారు. భవిష్యత్తులో కచ్చితంగా మంచి అవకాశం కల్పిస్తామని నారాయణరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. దీంతో తాను పార్టీ మారాలనే ఆలోచన చేయలేదని, టీఆర్‌ఎస్ అభ్యర్థితో కలసి ప్రచారం చేస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్‌తో కలసి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కల్వకుర్తిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు వెళ్లారు. దీంతో కల్వకుర్తి టీఆర్‌ఎస్‌లో అసమ్మతి ముగిసిపోయింది.
అధిష్టానం నిర్ణయం శిరోధార్యం: శంకరమ్మ
టికెట్ కేటాయింపులో టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మాహుతికి పాల్పడిన శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment