‘సెమీఫైనల్‌’ వ్యూహాలకు పదును!.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక భేటీ Discussions on BJPs alliances with regional parties | Sakshi
Sakshi News home page

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై నడ్డా, అమిత్‌షా, బీఎల్‌ సంతోష్‌ కీలక భేటీ 

Published Wed, Jun 7 2023 3:14 AM

Discussions on BJPs alliances with regional parties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సారత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన ఎన్నికలు జరిగే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్‌ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు, తిరిగి మంగళవారం ఉదయం దాదాపు పది గంటలపాటు కీలక చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకున్న బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటిని అధిగమించే అంశంపై మేథోమథనం జరిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా ఉండటం, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, రాజస్తాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 29, ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలు కలిపి మొత్తంగా 82 స్థానాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులోభాగంగా కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను, ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. 

తెలంగాణలో ఏం చేయాలి? 
తెలంగాణలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని తమవైపు తిప్పుకునే అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటే కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో సహా ఇతర కమిటీల నియామకాలను పూర్తి చేస్తూనే, సంస్థాగత నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ముఖ్యమైన బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి.. నేతల మధ్య ఐక్యత చెడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఈ నెలలో తెలంగాణలో జరిపే పర్యటనలపైనా చర్చించారు.

ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, అధికార పక్షం లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అసమ్మతి నేతలతో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు అవకాశాలపైనా సమాలోచనలు చేశారు. అలాంటివి సాధ్యంకాని చోట ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ముచేసుకునే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు.

ఇందులోభాగంగానే ఇటీవల జరిపిన భేటీలో తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముందుంచిన ప్రతిపాదనలపైనా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ ఇంచార్జి సునీల్‌ బన్సల్‌ అభిప్రాయాలను కూడా ముగ్గురు అగ్రనేతలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.  
చదవండి: పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి 

Advertisement
 
Advertisement
 
Advertisement