సాక్షి, ఢిల్లీ: దేశంలో ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక, గెలుపు గుర్రాల కోసం కమలదళం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
వివరాల ప్రకారం.. బీజేపీ నేతలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. దీంతో, ఎన్నికల బరిలో కమలం పార్టీ నుంచి ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు ఉన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లలో అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో వారి తర్వాతే లిస్ట్..
మరోవైపు.. తెలంగాణలో కూడా బీజేపీ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు జరిగే సమావేశంలో మాత్రం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులపై పార్టీ హైకమాండ్ ఇంకా దృష్టిసారించలేదని సమాచారం. ఇక, ఇటీవలే తెలంగాణలో బీజేపీ చీఫ్‌ను పార్టీ అధిష్టానం మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ఎంపికయ్యారు. అయితే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బీజేపీ లిస్ట్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం హైకమాండ్ ఫోకస్‌పెట్టినట్టు సమాచారం.
మిజోరంతో బీజేపీకి ఎదురుదెబ్బ..
ఐదు రాష్ట్రాలు మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈసారి విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మిజోరంలో ఈ నెల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. కూటమిలో విభేదాలను ఎత్తిచూపుతూ మణిపూర్‌లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ విమర్శించింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా హోరాహోరీ పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు
Comments
Please login to add a commentAdd a comment