Telangana: పది నెలలూ ప్రజల్లోనే | JP Nadda and Amit Shah directed Telangana BJP leaders | Sakshi
Sakshi News home page

Telangana: పది నెలలూ ప్రజల్లోనే

Published Wed, Mar 1 2023 3:00 AM | Last Updated on Wed, Mar 1 2023 1:15 PM

JP Nadda and Amit Shah directed Telangana BJP leaders - Sakshi

మంగళవారం ఢిల్లీలో జేపీ నడ్డా, అమిత్‌ షాలతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న తరుణ్‌ చుగ్, జితేందర్‌రెడ్డి, ఈటల, బండి సంజయ్‌ తదితరులు

సాక్షి, న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని స్థాయిల బీజేపీ నాయకులు సమన్వయంతో, సమష్టిగా వ్యవహరిస్తూ ఎన్నికల కురుక్షేత్రానికి సి­ద్ధం కావాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి సాగనంపేలా, తెలంగాణలో కచ్చితంగా కాషాయజెండా ఎగురవేసేలా.. స్పష్టమైన వ్యూహాలు, కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా కేవలం బీజేపీకే ఉందనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ‘ఇంటింటికీ కమలం పువ్వు’ నినాదంతో వచ్చే పది నెలలు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి విశ్వాసాన్ని, మద్దతును కూడగట్టేలా వివిధ రూపాల్లో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అంతకుముందు నడ్డా, అమిత్‌షా­తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ , తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, సహ ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్, రాష్ట్రనేతలు సమావేశమయ్యారు.

ఈ భేటీ మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్‌షా, నడ్డా, ఇతర నేతలు విడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు బయటే ఉండిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల వరకు రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, కె.లక్ష్మణ్, వివేక్‌ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావులతో అమిత్‌షా, నడ్డా భేటీ అయ్యారు.

మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ సంసిద్ధత, వ్యూహాల ఖరారు వంటి అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అభినందించిన నడ్డా, షా.. పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. 

గెలుపు లక్ష్యంగా ప్రజల్లోకి... 
‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజా స్పందన మెరుగ్గా ఉందని మాకు నివేదికలు అందాయి. ఈ మార్చి నుంచి సెప్టెంబర్‌ దాకా పోలింగ్‌ బూత్‌లు, నియోజకవర్గాల వారీగా సభలు, ర్యాలీలు, వివిధస్థాయిల నాయకుల చేరికలు వంటి వాటిని విస్తృతంగా చేపట్టి ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులను చేయాలి.

ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్టం కావడం, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంపై పార్టీ యావత్‌ యంత్రాంగం దృష్టి పెట్టాలి.

రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడం, వివిధ వర్గాలు ఇంకా తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. 119 నియోజకవర్గాల్లోనూ సభలు నిర్వహించాలి. వీటికి జాతీయ నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు. ఇక పాత పది జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభలకు అగ్ర నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు..’ అని చెప్పారు.  

లిక్కర్‌ స్కాంపై చర్చ జరగలేదా? 
సాయంత్రం మూడున్నర గంటల  సమయంలో ఈ భేటీలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై చర్చిస్తారని వార్తలు వచ్చినా అలాంటిదేమీ జరగలేదని నేతలు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, పార్టీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలు కూడా చర్చకు రాలేదని చెప్పారు.

అయితే బీఆర్‌ఎస్‌ పార్టీపై కొద్దిసేపు సరదాగా చర్చించిన నేతలు.. ఆ పార్టీ జాతీయ పార్టీ అయితే మొన్నటి త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటూ వ్యాఖ్యానించారని తెలిసింది.

ఇకపై ప్రతి నెలా తమలో ఒకరి రాష్ట్ర పర్యటన ఉంటుందని, రెండు లేక మూడు సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా చూస్తామని నడ్డా, షా అన్నట్టు నేతలు తెలిపారు. కాగా రాష్ట్రంలో పెద్దెత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ప్రభుత్వంపై చార్జిషీట్లు విడుదల చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు సూచించినట్టు సమాచారం. 

అన్ని స్థాయిల్లో చేరికలు ప్రోత్సహించాలి 
‘రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలనపై ప్రజలు విసుగుతో ఉన్నారు. పార్టీ గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలను ప్రోత్సహించాలి. నేతలు సమన్వయంతో వ్యవహరించాలి.’ అని నడ్డా, షా సూచించారు.   

ముమ్మర పర్యటనలు.. బహిరంగ సభలు 
‘రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమా­వేశాలæ తర్వాత, పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్కోచోట 50 వేల మందికి తగ్గకుండా బహి­రంగ సభలు నిర్వహించాలి. మార్చిలో అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు  పర్యటించాలి.

ఏప్రిల్‌లో ప్రధాని పాల్గొనే విధంగా, రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పోలింగ్‌ బూత్‌ల్లోని పార్టీ కమిటీలు, కార్యకర్తలతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలి..’ అని సమావేశాల్లో నిర్ణయించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement