సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాబోయే రెండు నెలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాల్గొన్న పాలమూరు సభకు విశేషమైన ప్రజాదరణ లభించిందన్నారు. ఈ నెల 10 వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు.
నవంబర్ మొదటి వారంలోగా 30సభలు
రాష్ట్రంలో నవంబర్ మొదటి వారంలోపు 30 సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయని... 5వ తేదీన జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్‌లు, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుందని, 6వ తేదీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కనీ్వనర్లు, ఇంచార్జ్‌లతో కలిపి మొత్తం 800మంది ఈ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 5 తేదీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, 6వ తేదీ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దిశానిర్దేశం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
మోదీ సభను రైతులు జయప్రదం చేయాలి
నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డును మంజూరు చేసినందుకు ప్రధానికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను సాకారం చేసిన ప్రధానికి రైతులంతా సంఘీభావం పలకాలని కోరారు. మంగళవారం నిజామాబాద్‌లో మోదీ పాల్గొనే బహిరంగ సభను పసుపు రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పదాధికారుల భేటీకి బీఎల్ సంతోష్
ఈ నెల 5న నిర్వహించే రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఈ నెల 10న అమిత్ షా పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి(మంచిర్యాల)లో భారీ బహిరంగసభకు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment