
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి బీజేపీ అగ్రనాయక త్రయం పర్యటించనుంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో బహిరంగ సభలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగ్గురు అగ్రనేతలు శంఖం పూరిస్తారని భావిస్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరగనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో వీరి పర్యటనలు జరగనుండటం విశేషం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన విజయాలను చాటడంతోపాటు ప్రజలను స్వయంగా కలుసుకునేందుకు ఉద్దేశించిన ‘మహా జనసంపర్క్ అభియాన్’లో భాగంగా రాçష్టంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులోభాగంగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో అమిత్‌షా ప్రసంగించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందనే భావనను అమిత్ షా భారీ బహిరంగ సభతో తిప్పికొట్టాలనే వ్యూహంతో రాష్ట్ర నాయకత్వముంది. అదేవిధంగా 25న నాగర్‌కర్నూల్ సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
ఈ నెలాఖరులోగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మోదీ రోడ్‌షో, ఆ తర్వాత నల్లగొండలో బహిరంగసభ నిర్వహించే అవకాశముంది. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ ప్రతిపాదనలు పంపగా, తేదీని జాతీయ నాయకత్వం ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది.
కర్ణాటక నైరాశ్యం నుంచి బయటపడేలా...
కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రభావం తెలంగాణపై పడటంతోపాటు ఇక్కడా కాంగ్రెస్ పుంజుకుంటోందనే వాదనను తిప్పికొట్టేందుకు మోదీ, అమిత్‌షా, నడ్డా సభలు ఉపయోగపడతాయని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు స్వయంగా అధినాయకత్వమే రాష్ట్రానికి వస్తుండటంతో రాష్ట్రంలో పార్టీపై మరింత ఫోకస్ పెరుగుతుందని భావిస్తున్నారు.
కర్ణాటక ఓటమి నైరాశ్యంతోపాటు కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకుల్లో ఆవరించిన స్తబ్దతను బద్దలుకొట్టి అసెంబ్లీ ఎన్నికలకు చురుకుగా పనిచేసేందుకు ఈ పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. అలాగే, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతాయనే ఆశాభావంతో ఉన్నారు.
ప్రత్యామ్నాయమని చాటేందుకు...
రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారబోయేది బీజేపీనే అనే భావన ప్రజల్లో ఏర్పడేందుకు అగ్రనేతల పర్యటనలు దోహదపడతాయని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, జరిగే అభివృద్ధి గురించి అగ్రత్రయం వివరించడం ద్వారా ఓ సానుకూల ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
దక్షిణాదిలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్న రాష్ట్రంగా తెలంగాణను జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. అందుకే ఆ అవకాశం చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగా ఇక్కడ నిర్వహించే వరుస కార్యక్రమాల్లో అగ్రనేతలు పాల్గొనాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు ‘మహా జనసంపర్క్ అభియాన్’కార్యక్రమాలు ముగియగానే, జూలై నుంచి మూడు, నాలుగు నెలలపాటు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు.
చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే!
Comments
Please login to add a commentAdd a comment