శివసేన, బీజేపీల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీరి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. పొత్తు విషయంపై అధికారికంగా ఎవరు చెప్పకపోయినప్పటికీ పాత ఫార్ములాతో మంత్రిమండలి విస్తరించాలని శివసేన పట్టుబడుతుండగా దీనికి బీజేపీ సమేమిరా అంటుందని తెలిసింది. శివసేనతో చేతులు కలిపేందుకు సుముఖంగా ఉన్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే శుక్రవారం సాయంత్రం మాతోశ్రీలో శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
ఈ చర్చల్లో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్‌లతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆ పార్టీ నేత సుభాష్ దేశాయి, ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నట్టు తెలిసింది. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. శివసేన 1995 ఫార్ములా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారం ఉపముఖ్యమంత్రితోపాటు హోంశాఖ, ప్రజాపనుల శాఖ, విద్యుత్ శాఖ, జలవనరుల శాఖ తదితర ఆరు కేబినేట్ మంత్రి పదవులు కావాలని శివసేన కోరింది.
అదేవిధంగా సహాయక మంత్రి పదవులను కూడా శివసేనకు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగాలేదని, ఒకవేళ మరీ అవసరమైతే శివసేనకు హోం శాఖ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఏదోఒక విధంగా ‘పొత్తు’ కుదుర్చుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.